ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల బాటలోనే సాగాయి. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించటంతో మార్కెట్లు ఆరంభం నుంచి పతనబాటలోనే సాగాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లతో పాటు కోటక్ మహీంద్రా షేర్లలో భారీగా అమ్మకాలకు దిగటంతో బెంచ్‌మార్క్ సూచీ సూచీ 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 పాయింట్ల వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 80,100.65 పాయింట్ల స్థాయిని తాకింది. ఇన్ఫోసిస్, హెచ్‌డీఎ్‌ఫసీ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తటంతో సూచీ నష్టాలను భారీగా తగ్గించుకుంది.
మరోవైపు ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 168.6 పాయింట్లు నష్టపోయి 24,362.20 స్థాయిని తాకినప్పటికీ చివరలో కోలుకుంది. దీంతో నిఫ్టీ 21.65 పాయింట్ల నష్టంతో 24,509.25 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవటంతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. దీంతో రిలయన్స్ షేరు 3.49 శాతం నష్టంతో రూ.3,001.10 వద్ద క్లోజైంది. కంపెనీ మార్కెట్ విలువ కూడా రూ.73,470 కోట్లు తగ్గి రూ.20,30,488.32 వద్దకు చేరుకుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు కూడా 3 శాతం మేర నష్టపోయింది.









