టాటా గ్రూప్ కంపెనీ ఇండియన్ హోటల్స్‌కు చెందిన అనుబంధ సంస్థ బెనారెస్ హోటల్స్ తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించేందుకు సిద్ధమైంది. అంతే కాదు దీర్ఘకాలంలో ఈ స్టాక్ అదిరిపోయే లాభాలు అందించింది. రూ. 100 దిగువన ట్రేడైన ఈ స్టాక్ ఏకంగా రూ.10,000 జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం రూ. 8 వేల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. ఈ స్టాక్ డివిడెండ్ చెల్లించనున్న క్రమంలో ఈ వారం ఫోకస్ లోకి వచ్చింది.
బెనారెస్ హోటల్స్ స్టాక్ ఈ రోజు 1.52 శాతం నష్టంతో రూ. 7,851 వద్ద ట్రేడింగ్ అవుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 1,000 కోట్లకు పైగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 10,051 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 4,439 వద్ద ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసుకుంటే14 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో చూస్తే 59 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో 509 శాతం రిటర్న్స్ ఇచ్చింది. 1995 జూలై లో రూ. 97 వద్ద ఉన్న ఈ షేరు ఏకంగా 8,147 శాతం పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
అత్యధిక డివిడెండ్ ప్రకటన
కంపెనీ చరిత్రలోనే తొలిసారి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 250 శాతం అంటే ఒక్క షేరుకు రూ. 25 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది. అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించేందుకు ఆగస్టు 22 రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఈ వారమే ఎక్స్ స్ప్లిట్ గా ట్రేడైంది. ఆగస్టు 22వ తేదీన ముగిసే సమయానికి ఈ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ పొందేందుకు అర్హత లభిస్తుంది. కంపెనీ డెరైక్టర్లు ఇప్పటికే ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ తర్వాత డివిడెండ్ షేర్ హోల్డర్ల అకౌంట్లలో జమ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ. 20 చొప్పున డివిడెండ్ చెల్లించింది.









