వరుసగా ఆరో రోజూ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు తరలించుకుపోవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ ఇంట్రాడేలో 81 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 638.45 పాయింట్లు నష్టపోయి 81,050 వద్ద ముగిసింది.
మరోసూచీ నిఫ్టీ కూడా 218.85 పాయింట్లు కోల్పోయి 25 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. చివరకు 24,795.75 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరుల సంపద లక్షల కోట్ల స్థాయిలో కరిగిపోయింది. వరుసగా ఆరు సెషన్లలో సెన్సెక్స్ 4,521.85 పాయింట్లు లేదా 5.28 శాతం నష్టపోవడంతో మదుపరులు ఏకంగా రూ.9 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీ మార్కెట్ విలువ రూ.8,90,153.84 కోట్లు కరిగిపోయి రూ.4,51,99,444.70 కోట్ల(5.38 ట్రిలియన్ డాలర్లు) వద్దకు పడిపోయింది. అంతకుముందు రూ.4,60,89,598.54 కోట్లు (రూ.5.49 ట్రిలియన్ డాలర్లు) గా ఉన్నది.
- అదానీపోర్ట్స్ 4.17 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది.
- ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్లు రెండు శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి.
- అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, కొటక్ బ్యాంక్, నెస్లె, ఎల్అండ్టీ, మారుతి, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, టాటా మోటర్స్ షేర్లు కూడా పతనం చెందాయి.
- మహీంద్రా అండ్ మహీంద్రా 1.46 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా యుటిలిటీ రంగ షేర్లు అత్యధికంగా 3.63 శాతం నష్టపోగా, పవర్ 3.14 శాతం, సర్వీసులు 3.12 శాతం, కమోడిటీస్ 2.54 శాతం, టెలికం 2.49 శాతం, ఎనర్జీ 2.46 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.38 శాతం చొప్పున నష్టపోయాయి.
- కానీ, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు కదంతొక్కడంతో సూచీల భారీ నష్టాలు తగ్గించుకోగలిగింది.
- సర్వీసు క్వాలిటీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ఓలా షేరు 8 శాతం నష్టపోయి రూ.90.82 వద్ద నిలిచింది.









