భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9.51 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి నేపథ్యంలో అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మన్మోహన్ సింగ్ సంపాదించుకున్న ఆస్తులు ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంతంటే..
ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ మాజీ ప్రధాని చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు. ఇక ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్‌లో ఓ ఫ్లాట్ ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్‌కు ఎలాంటి అప్పులు లేవు.
2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా పనిచేశారు. ఆ క్రమంలో ఆయన కృషి, పని పట్ల నిబద్ధత విషయంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇక ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో
డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తదుపరి విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ఆ తర్వాత 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో డి.ఫిల్ చేశారు.
కీలక పదవులు
మన్మోహన్ సింగ్ 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. డా. సింగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, ప్రధాన మంత్రికి సలహాదారుగా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.









