రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ హైదరాబాద్‌లో హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్టును నిర్మించబోతున్నది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో పది ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టు వచ్చే నాలుగేండ్లలో పూర్తికానున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసోర్ తెలిపారు.
45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 25 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ హోమ్స్‌ను, 20 లక్షల చదరపు అడుగుల్లో కమర్షియల్ టవర్, 6 లక్షల చదరపు అడుగుల్లో మాల్, 10 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇందులో ఇప్పటికే భూసేకరణ ఇతర ఖర్చుల కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్టు బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ (బీఈఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అమర్ మైసూర్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 ఎకరాల్లో 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే చోట వరల్డ్ ట్రేడ్ సెంటర్, బ్రిగేడ్ రెసిడెన్స్, బ్రిగేడ్ ఓరియన్ మాల్, మూడు వందలకుపైగా గదుల సామర్ధ్యంతో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ ఏర్పాటు చేస్తారు. నాలుగేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టులో ‘బ్రిగేడ్ రెసిడెన్స్’ పేరుతో ఏర్పాటు చేసే వెంచర్‌లో ఒక్కో సూపర్ లగ్జరీ ఫ్లాట్ ధర విస్తీర్ణాన్ని బట్టి రూ.4 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుందని డైరెక్టర్ అమర్ మైసోర్ తెలిపారు.









