హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల విక్రయాలు.. తాజాగా నివేదిక వెల్లడి

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ లో ఇళ్లు కొనుగోలు చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జీవన విధానానికి ఆకర్షితులై చాలా మంది హైదరాబాద్ లో సొంతింటి కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంగానే.. గతేడాది ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాల్లో భాగ్యనగరం సరికొత్త రికార్టు సొంత చేసుకుంది. ఏకంగా  అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12% వృద్ధి సాధించింది.

గతేడాది కొత్త నిర్మాణాలు, విక్రయాలపై స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదికను వెల్లడించింది.   భాగ్యనగరంలో 2023 తో పోల్చితే విక్రయాలు పెరిగినట్లు స్పష్టమవుతుంది. 2024లో కొత్తగా 44,013 నిర్మాణ పనులు పట్టాలెక్కగా, అందులో 36,974 ఇళ్లు అమ్ముడుపోయినట్లు ఈ నివేదిక వెల్లడిస్తోంది.

హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల విక్రయాలతో పాటు ధరలు సైతం పెరిగినట్లు గుర్తించారు. అన్ని రకాల ఇళ్లపై సగటున 8% ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున ప్రారంభమైన ఎల్ బీ నగర్, కొంపల్లిలో ఇళ్ల ధరలు పెరుగుతుండగా… ఎల్‌బీనగర్‌లో ఏడాది కాలంలో సగటున 11%, కొంపల్లిలో 10% వరకు ధరలు పెరిగాయి.

నగరంలో విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే.. గతేడాది విక్రయాల్లో ఏకంగా రూ.1-2 కోట్ల విలువైనవి 45% ఉన్నాయి. గత ఏడాదిలో ఈ శ్రేణిలోనివి 16,459 ఇళ్లు అమ్ముడుకాగా.. ఇప్పుడు వాటి వాటా పెరగడం స్పష్టంగా ప్రజల ఆసక్తిని తెలుపుతోంది. అలాగే.. రూ.2-5 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాల్లో 72%, రూ.5-10 కోట్ల ఇళ్ల అమ్మకాల్లో 39%, రూ.10-20 కోట్ల గృహాల్లో 51% వృద్ధి కనిపించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు