ఐటీ దిగ్గజం టీసీఎస్‌ లాభం రూ.12,380 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌ రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదు చేసిన రూ.11,058 కోట్ల లాభంతో పోలిస్తే 11.95 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ క్యూ3లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.6 శాతం వృద్ధితో రూ.63,973 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రాబడి రూ.60,583 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ3లో కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్‌ 24.5 శాతానికి పెరిగింది. గత క్యూ3లో ఇది 24.1 శాతంగా ఉంది. బీఎస్‌ ఈలో టీసీఎస్‌ షేరు ధర గురువారం 1.72 శాతం తగ్గి రూ.4,036.65 వద్ద స్థిరపడింది.

1,020 కోట్ల డాలర్ల కొత్త ఆర్డర్లు: 

ఉత్తర అమెరికా సహా పాశ్చాత్య మార్కెట్లకు క్రిస్మస్‌ సెలవుల సీజన్‌ కావడంతో సాధారణంగానే క్యూ3లో ఐటీ రంగ పనితీరు బలహీనపడుతుంది. కానీ, ఈ డిసెంబరు త్రైమాసికంలో టీసీఎస్‌ 1,020 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరపు క్యూ3లో లభించిన 810 కోట్ల డాలర్ల కాంట్రాక్టులతో పోలిస్తే 25.93 శాతం అధికమిది. అంతేకాదు, గత ఐదేళ్లలో మూడో త్రైమాసికానికి కంపెనీ నమోదు చేసిన అత్యధిక కొత్త ఆర్డర్ల విలువ ఇదే.

ఉద్యోగుల్లో 5,370 మంది తగ్గుదల: క్యూ1, క్యూ2 ట్రెండ్‌కు భిన్నంగా టీసీఎస్‌ లో ఉద్యోగులు మళ్లీ తగ్గారు. క్యూ3లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,370 తగ్గి 6,07,354కు పరిమితమైంది. గత త్రైమాసికానికి కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 13 శాతానికి పెరిగింది. క్యూ2 అట్రిషన్‌ రేటు 12.3 శాతంగా ఉంది.

25,000 మందికి ప్రమోషన్లు: గడిచిన మూడు నెలల్లో 25,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు టీసీఎస్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1.10 లక్షల మందిని పైస్థాయికి ప్రమోట్‌ చేయడం జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య మొత్తం సిబ్బందిలో దాదాపు 20 శాతానికి సమానం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు