ఎన్నారైల చూపు భారత రియల్ రంగం వైపు.. పెరుగుతున్న ప్రాపర్టీ కొనుగోళ్లు

భారత రియల్ రంగం తమ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం అని భావించే ఎన్నారైల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు, స్థిరాస్తి రంగంలో పలు సంస్కరణలు.. కొనుగోలుదారుల ప్రాధాన్యతల వంటి అంశాలు ఎన్నారైలను స్వదేశం వైపు చూసేలా చేస్తున్నాయి.

పండుగల సీజన్ ఊపందుకోవడంతోపాటు కీలకమైన లోక్ సభ ఎన్నికలు ముగియడంతో భారత రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. నిజానికి భారత రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నారైలకు ఆసక్తి పెరగడం వెనుక భావోద్వేగ, ఆర్థిక ప్రేరణలు రెండూ ఉన్నాయి. అనుకూలమైన కరెన్సీ మార్పిడి రేట్లు వారి కొనుగోలు శక్తిని పెంచగా.. రెరా, జీఎస్టీ వంటి అంశాలు భారత రియల్ రంగంలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించాయి.

అలాగే టెక్నాలజీ సైతం ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో చాలామంది డెవలపర్లు ఎన్నారైల కోసమే ప్రత్యేకంగా ప్రాజెక్టులు లాంచ్ చేసి విక్రయించేవారు. ధర కూడా కాస్త ఎక్కువే ఉండేది. అప్పట్లో ఇంటర్నెట్, టెక్నాలజీ వంటివి ఇప్పుడున్న విస్తృతంగా లేకపోవడం వల్ల మిగిలిన ప్రాజెక్టుల గురించి వారికి సరిగా తెలిసేది కాదు. దీంతో ఎక్కువ ధర పెట్టి ఎన్నారై ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుక్కునేవారు. అయితే, ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. ఎన్నారైల్లో ఎక్కువ మంది యువతే కావడం.. వారికి టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండటంతో భారత రియల్ మార్కెట్లో ఏం జరుగుతోందో అక్కడి నుంచే తెలుసుకుంటున్నారు.

ప్రాపర్టీలను అక్కడ నుంచి వర్చువల్ టూర్ల ద్వారా ప్రత్యక్షంగా చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఎన్నారైలు ఇండియాలో ఆస్తి కొనాలంటే బంధువులో లేదా మధ్యవర్తులపైనో ఆధారపడాల్సి వచ్చేది. ఇంకా వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, బోలెడంత పేపర్ వర్క్ ఉండేది. కానీ టెక్నాలజీ ఆ పరిస్థితి దూరం చేసి, ఎన్నారైలు సులభంగా ఆస్తులు కొనుగోలు చేసే వెసులుబాటు తీసుకొచ్చింది. ఫలితంగా బోలెడంత డబ్బు, సమయం కూడా ఆదా అవుతున్నాయి. స్వదేశంతో ఉండే భావోద్వేగమైన బంధంతోపాటు భారత రియల్ రంగంలో పెట్టుబడులకు భద్రత, స్థిరత్వం ఉన్నాయనే భావన వారిని స్తిరాస్థి రంగం వైపు అడుగులు వేయిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు