ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార, పారిశ్రామిక ప్రస్థానాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. జీవిత అనుభవాలతోనే ఎవరికైనా వివేకం వస్తుందన్నారు. విజ్ఞానం మాత్రం బాగా చదివితేనే వస్తుందన్నారు. అహ్మదాబాద్‌లో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసిన అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ జీవిత సత్యాలు చెప్పారు. కాలేజీ మానేసి 16 ఏళ్ల వయసులో కేవలం రైలు టిక్కెట్‌కు సరిపడా డబ్బులతో ముంబై చేరిన తాను ఎన్ని కష్టాలు పడిందీ వివరించారు.
చిన్న వయసులోనే బతుకుదెరువు కోసం ముంబై చేరడం, అక్కడ ఒక వజ్రాల ట్రేడింగ్ కంపెనీలో చేరి మూడేళ్లలోనే ఆ వ్యాపారంలోని మెలకువలు ఆకళింపు చేసుకుని వజ్రాల ట్రేడింగ్ కోసం సొంత బ్రోకరేజీ సంస్థను ఏర్పాటు చేసిన విధానాన్ని వివరించారు. ఈ బ్రోకరేజీ వ్యాపారంలో 1981లో 19 ఏళ్ల వయసులో తొలి ట్రేడింగ్‌లోనే రూ.10,000 కమీషన్ సంపాదించిన విషయాన్నీ ఆయన వెల్లడించారు. ‘ఒక జపాన్ కొనుగోలుదారుడితో నేను జరిపిన మొదటి ట్రేడింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ తొలి ట్రేడింగ్‌లోనే నాకు రూ.10,000 కమీషన్ లభించింది. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా అది నా తొలి ప్రయాణం’ అన్నారు.
అంచెలంచెలుగా ఎదిగా: ఆ తరువాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి తన అన్న కొనుగోలు చేసిన ఒక చిన్న పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నడపడంలో సహాయ పడడం, 1988లో సొంతంగా అదానీ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో కమోడిటీస్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేసి, అంచెలంచెలుగా ఎలా వివిధ వ్యాపారాల్లో ఎదిగిందీ అదానీ విద్యార్థులకు వివరించారు. జీవితంలో ఎన్ని అపజయాలు, ఎదురుదెబ్బలు తగిలినా ఎదగాలనే లక్ష్యం నుంచి నీరుగారి పోవద్దని విద్యార్థులను కోరారు. జీవితంలో ఎదగాలని కలలు కనడం సంపన్నులకు మాత్రమే పరిమితమైన సొత్తు కాదన్నారు.









