దేశంలోని 60 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు. ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు. అంటే రూ. 50 వేల నుంచి రూ.1 లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలో రూ. లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపైనా ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రస్తుతం అద్దె ఆదాయం రూ.2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేది. దానిని ఏకంగా రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు. రూ.1 లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు. అలాగే అద్దె ఆదాయంపై రూ.6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.









