కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిన్న పరిశ్రమలకు వరాలు ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలతో పాటు స్టార్టప్ కంపెనీలకు శుభవార్త అందించారు. వారికి అందించే రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని ద్వారా దేశంలో చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక పథకం ద్వారా రూ.5 కోట్ల వరకు రుణాలు అందిస్తోంది. ఈ పరిమితిని రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు బడ్జెట్ 2025 ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంటే రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు రుణ పరిమితి పెరిగింది.
స్టార్టప్ కంపెనీలకు రూ.20 కోట్లు..
దేశంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌లో స్టార్టప్ కంపెనీలకు శుభవార్త చెప్పారు. అంకుర పరిశ్రమలకు అందించే రుణాల పరిమితిని రెండింతలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలకు అందిస్తున్న రూ.10 కోట్ల రుణ పరిమితిని రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం..
దేశంలో బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకొస్తోంది. బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకం ప్రకటిస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.









