ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.
సామాన్య ప్రజలకు ఊరట..
రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. 6.50 శాతం ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గించామన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించడంతో దేశంలోని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరుగుతుందని రియల్టర్ల మండలి నరెడ్కో వెల్లడించింది. ‘‘రియల్టీ రంగం బలమైన వృద్ధి, సానుకూల ధోరణిని కనబరుస్తోంది. రెపో రేటును తగ్గించడం ద్వారా ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చు. 25–30 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చి, నిర్మాణం, సిమెంట్, స్టీల్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగించగలదు,’’ అని నరెడ్కో అధ్యక్షుడు జి. హరిబాబు అన్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజనం కలుగుతుందని, రుణాల ఖర్చు తగ్గుతుందని నైట్‌ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ అభిప్రాయపడ్డారు. ‘‘రేట్లు తగ్గడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడుతుంది. దీంతో డెవలపర్లు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందగలుగుతారు,’’ అని ఆయన అన్నారు. వినియోగ వృద్ధికి మద్దతుగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో తీసుకున్న చర్యలకు తోడుగా, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని బీసీడీ గ్రూప్ సీఎండీ అంగద్ బేడి అభిప్రాయపడ్డారు.
రెపో రేటు తగ్గించడంతో రియల్ ఎస్టేట్ రంగం కొత్త ఊపును సంతరించుకోనుంది. రుణాల ఖర్చు తగ్గడం, హౌసింగ్ మార్కెట్ వృద్ధిని పెంచే అవకాశాన్ని కల్పించనుంది. అలాగే, సొంత ఇల్లు కలిగి ఉండటం ద్వారా భద్రత, స్థిరత్వం, సామాజిక సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇంటిని కలిగి ఉండటం ఉత్తమ నిర్ణయంగా చెప్పొచ్చు.









