అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మధ్య ఇటీవల సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత కంపెనీ కీలకమైన చర్యలు తీసుకుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రధానితో భేటీ తర్వాతి రోజే టెస్లా భారత్‌లో ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు పలు నివేదికలు తెలిపాయి. టెస్లా కంపెనీ భారత్‌లోని పలు నగరాల్లో షోరూమ్‌లను తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్‌లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్‌లో ప్రవేశించేందుకు తాజాగా ప్రయత్నాలను మరోసారి ముమ్మరం చేసింది. వాస్తవానికి గతంలో దిగుమతి సుంకాల నేపథ్యంలో భారత్‌లో ఎంట్రీ ప్రణాళికలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. టెస్లా తొలి షోరూమ్‌ను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ కంపెనీల హోటల్స్, రిటైల్ షాప్స్, కార్యాలయాలకు దగ్గరగా ఉన్నందున.. టెస్లా ఏరోసిటీనే ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ముంబయిలో టెస్లా తన షోరూమ్‌ను బంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)కు, ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోనే ఉండనున్నది. ఇక ఢిల్లీ, ముంబయి షోరూమ్స్ దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నాయి. షోరూమ్‌ల ప్రారంభ తేదీలు ఖరారు కాలేదని తెలుస్తున్నది. టెస్లా ప్రారంభంలోనే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తుంది. ఆ తర్వాత స్థానికంగా అసెంబ్లీ పాయింట్ లేదంటే.. ప్లాన్‌ను నెలకొల్పే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.









