శుక్రవారం ముగింపు (73, 198)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 220 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయి 72, 784 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కాస్త కోలుకుంది. ముఖ్యంగా చివరి గంటలో కొనుగోళ్లు జరిగాయి. చివరకు సెన్సెక్స్ 112 పాయింట్ల నష్టంతో 73, 085 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా కోల్పోయి చివరకు 5.4 పాయింట్ల స్వల్ప నష్టంతో 22, 119 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఆర్ఈసీ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఏంజెల్ వన్, బీఎస్ఈ లిమిటెడ్, ఇండియన్ రెన్యుబుల్ ఎనర్జీ, ఎమ్‌సీఎక్స్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 68 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.37గా ఉంది.
నిరంతరాయంగా విదేశీ మదుపర్లు నిధులు విత్‌డ్రా చేయడంతో బ్లూ చిప్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్లో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15శాతం) నష్టపోయి 73,085.94 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 73,649.72పాయింట్ల గరిష్టం నుంచి 72,784.54 పాయింట్ల కనిస్ట స్థాయికి పతనమైంది.









