అప్పర్ సర్క్యూట్ కొట్టిన స్టాక్.. లక్షను రూ. 44 లక్షలు చేసింది.. ఐదేళ్లలోనే కాసుల పంట!

కొద్ది రోజుల కిందట అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, ప్రతీకార సుంకాల విధింపు నేపథ్యంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం వస్తుందన్న భయాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో అక్కడ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. వృద్ధి మందగమనంలోకి జారుకోవడం.. ఇలా చాలా కారణాలతో ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్లలో పతనం కనిపించింది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి పడుతూ వచ్చాయి. వరుస సెషన్లలో భారీగా పడిపోగా.. ఎట్టకేలకు కొద్ది రోజుల కిందట బ్రేక్ పడింది.

ఇప్పుడు వరుసగా ఆరో రోజూ కూడా భారత మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పుడు కూడా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. భారత్‌పై ఇది పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఇదే సమయంలో కనిష్ట స్థాయిల వద్ద షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇక సోమవారం సెషన్లో (మార్చి 24) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1078 పాయింట్లు పెరిగి 77,984 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 23,658 వద్ద సెషన్ ముగించింది.

ఈ క్రమంలోనే చాలా రంగాల స్టాక్స్ పుంజుకున్నాయి. ఎక్కువగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ్టి సెషన్లో లాభపడ్డాయి. ఇక ఇదే బాటలో మనం ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. అదే డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సోమవారం సెషన్లో ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. కిందటి సెషన్లో రూ. 94.25 వద్ద ముగియగా.. ఇవాళ ఇది ఆరంభంలో స్వల్ప లాభాలతోనే ఓపెన్ అయినా.. తర్వాత మార్కెట్లు సానుకూలంగా ఉండటం సహా మరో కారణంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 98.96 వద్ద స్థిరపడింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఈ కంపెనీ ఒక ఆర్డర్‌ పొందడం వల్లే ఈ స్టాక్ ఇంతలా పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు కంపెనీ కూడా స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. గుజరాత్ ఖావ్డా పవర్ ప్రాజెక్టు కోసం కండక్టర్ల సరఫరా కోసం రూ. 215 కోట్ల విలువైన డీల్‌ను అదానీ గ్రీన్ ఎనర్జీతో చేసుకున్నట్లు తెలిపింది. ఇది ఈ కంపెనీకి వారం వ్యవధిలో రెండో ఆర్డర్ కావడం విశేషం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు