టెస్లా షోరూమ్‌లో అగ్నిప్రమాదం.. 17 కార్లు దగ్ధం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) షోరూమ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇటలీ (Italy)లోని రోమ్ (Rome) శివార్లలో గల టెస్లా షోరూమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 కార్లు పూర్తిగా కాలిపోయినట్లు ఇటాలియన్‌ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో షోరూమ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్‌ (DOGE) శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టెస్లాపై స్థానికులు దాడులు చేస్తున్నారు. షోరూమ్‌పై కాల్పులు, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆయా ఘటనల్లో అనేక టెస్లా కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇప్పుడు ఈ దాడులు అమెరికా వెలుపల కూడా చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ఇటలీలో మస్క్‌, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది.

మరోవైపు ఇలా వరుస దాడులపై టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ స్థాయిలో హింస చాలా పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. తన సంస్థ కేవలం ఎలక్ట్రిక్‌ కార్లను మాత్రమే తయారు చేస్తుందన్నారు. ఇలాంటి దాడులకు కారకులైన వారిని ఏమీ చేయలేదంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఆయా ఘటనలపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు