కుప్పకూలిన భారత స్టాక్‌ మార్కెట్లు.. నిమిషాల్లోనే రూ.19 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా- చైనా మధ్య సుంకాల యుద్ధం, ఆర్థిక మాంద్యం భయం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను కదిలించాయి. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం(ఏప్రిల్ 7) కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్‌లో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్‌ ప్రతీకార సుంకాలపై చైనా సైతం పన్నులు ప్రకటించింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం తప్పదనే సంకేతాల మధ్య భయాందోళనలు పెరిగాయి. దానికి తోడు అమెరికాలో మాంద్యం భయాలు ఎక్కువయ్యాయి. దాంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. ఫలితంగా మార్కెట్‌లో భారీగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్‌ మూడుశాతానికిపైగా నష్టపోయింది. సెన్సెక్స్‌. నిఫ్టీ దాదాపు పదినెలల కనిష్ఠానికి చేరాయి. నిఫ్టీలో లిస్టయిన కంపెనీల విలువ రూ.20లక్షల కోట్ల వరకు పతనమైంది. క్రితం సెషన్‌ (శుక్రవారం ముగింపు 75,364.69) తో పోలిస్తే సెన్సెక్స్‌ 71,449.94 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్ల దాకా పతనమైంది. కేవలం పది సెకన్లలోనే మార్కెట్‌లో రూ.19లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ఇంట్రాడేలో 73,403.99 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. అత్పల్పంగా 71,425.01 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది.

చివరకు 2,226.79 పాయింట్ల నష్టంతో 73,137.90 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో కొనసాగింది. ప్రారంభంలోనే వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది. చివరకు 742.85 పాయింట్ల నష్టంతో 22,161.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు పది నెలల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 2020 మార్చి తర్వాత భారీగా పతనమైంది. మార్కెట్‌లో దాదాపు 559 షేర్లు పురోగమించగా, 3,372 షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ అత్యధికంగా ట్రెంట్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్ లాభపడింది. ఇక మార్కెట్‌లో మెటల్ ఇండెక్స్ 6.7 శాతం, రియల్టీ ఇండెక్స్ 5.6 శాతం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, ఎనర్జీ, ఐటీ 2.5 నుంచి 4 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.4 శాతం నుంచి 4 శాతం చొప్పున తగ్గాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగాయి. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మాంద్యం భయాలు మెటల్‌ కంపెనీల షేర్లు భారీగా నష్టాలను చవిచూశాయి.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు