దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ప్రతీకార సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల వరకు పెరిగింది. చివరి వరకు అదే జోరును కొనసాగించింది. జూలై 9 వరకు అదనపు సుంకాలను అమలును వాయిదా వేస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే భారత్ సహా 60 దేశాలపై సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. ఉదయం సెన్సెక్స్ 74,835.49 వద్ద లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 74,762.84 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 75,467.33 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,310.11 పాయింట్ల లాభంతో 75,157.26 వద్ద ముగిసింది. నిఫ్టీ 429.40 పాయింట్లు పెరిగి 22,828.55 వద్ద స్థిరపడింది. దాదాపు 3,006 షేర్లు లాభపడ్డాయి, 807 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ భారీగా లాభాలను ఆర్జించాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 4 శాతం పెరగ్గా.. ఆటో, ఆయిల్, గ్యాస్, పవర్, పీఎస్‌యూ, టెలికాం, ఫార్మా ఒక్కొక్కటి రెండుశాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం వృద్ధిని నమోదు చేసింది.