మార్కెట్లోకి రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లు!

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఇది చాలదన్నట్టు వచ్చే నెల రోజుల్లో దేశీయ మార్కెట్‌కు మరో ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన 22 కంపెనీల ఐపీఓల్లో ఫర్మ్‌ అలాట్‌మెంట్లు పొందిన యాంకర్‌ ఇన్వెస్టర్లు వచ్చే నెల రోజుల్లో తమ వద్ద ఉన్న దాదాపు రూ.2.36 లక్షల కోట్ల విలువైన షేర్లను మార్కెట్లో కుమ్మరించే ప్రమాదం కనిపిస్తోంది.

లాకిన్‌ పీరియడ్‌ కారణంగానే

సెబీ నిబంధనల ప్రకారం ఐపీఓల్లో ఫర్మ్‌ అలాట్‌మెంట్‌ పద్దతిలో షేర్లు పొందిన యాంకర్‌ ఇన్వెస్టర్లు కనీసం మూడు నెలల వరకు ఆయా కంపెనీల షేర్లను అమ్మకూడదు. ఆ తర్వాత ఇష్టమైతే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. అయితే మంచి కంపెనీల ఐపీఓల్లో కొంతమంది యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లలో కొద్ది మొత్తా న్ని అయినా అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటారు. ఈ కారణంగానే వచ్చే నెల రోజుల్లో అనేక మంది యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న ఐపీఓ షేర్లలో పెద్ద మొత్తాన్ని సెకండరీ మార్కెట్లో కుమ్మరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జాబితాలోని కంపెనీల షేర్లు

యాంకర్‌ ఇన్వెస్టర్ల లాక్‌ పీరియడ్‌ ముగిసే షేర్లలో హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎం ఐఎల్‌) కూడా ఉంది. ఈ కంపెనీ గత ఏడాది అక్టోబరులో రూ.27,870 కోట్ల అతిపెద్ద భారీ ఐపీఓ జారీ చేసి రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్లకు జారీ చేసిన షేర్లలో 50.78 కోట్ల షేర్లకు వచ్చే నెల లాకిన్‌ పీరియడ్‌ ముగియబోతోంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ ఎంత లేదన్నా రూ.81,821.65 కోట్ల వరకు ఉంటుంది.

హ్యుండయ్‌ మోటార్‌తో పాటు డాక్టర్‌ అగర్వాల్‌ హెల్త్‌కేర్‌, స్విగ్గీ, వారీ ఇంజినీర్స్‌, డెంటా వాటర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, అజాక్స్‌ ఇంజనీరింగ్‌, డిఫ్యూజన్‌ ఇంజనీర్స్‌, నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌, గోదావరి బయోరిఫైనరీస్‌ వంటి కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి. దీంతో ఈ కంపెనీల షేర్లు సెకండరీ మార్కెట్లో తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share