13 ఏళ్ల వయసున్న ఆదిత్యన్ రాజేష్ ఒక మొబైల్ ఆప్లకేషన్ ను డెవలప్ చేసి తన సొంత ఐటీ కంపెనీని స్థాపించాడు. ఇతడి యూట్యూబ్ చానల్ కు లక్షల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. అత్యంత చిన్న వయసు సీఈవోగా గుర్తింపు పొందిన ఆదిత్యన్ రాజేష్ గురించి తెలుసుకుందాం. ఆదిత్యన్ కేరళ రాష్ట్రంలోని తిరువల్లాలో జన్మించాడు. ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల వయసులోనే అతడికి కంప్యూటర్ పై ఆసక్తి పెరిగింది.
ఆదిత్యన్ ముందుగా యూట్యూబ్ లో ఆటలు నేర్చుకున్నాడు. స్పెల్లింగ్ బీస్ లో పాల్గొనేవాడు. అనంతరం కోడింగ్ , డిజైనింగ్ పై ఆసక్తి పెరిగి, వాటిలో నైపుణ్యం సాధించాడు. దాదాపు ఆరేళ్ల వయసులోనే హెచ్ టీఎంఎల్, సీఎస్ఎస్ తదితర కోడింగ్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. టెక్నాలజీపై ఉన్న ఇష్టమే అతడిని ప్రపంచంలో ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. తొమ్మిదేళ్ల వయసులో ఆదిత్యన్ తన మొదటి ఆండ్రాయిడ్ యాప్ ను తయారు చేశాడు. అది విజయవంతంగా పని చేయడంతో అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
యాప్ ను తయారు చేయడంతోనే ఆదిత్యన్ ఆగిపోలేదు. ఏ క్రేజ్ అనే పేరుతో యూ ట్యూబ్ చానల్ ను కూడా నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా టెక్నాలజీ, కోడింగ్ గేమింగ్, వెబ్ డిజైనింగ్ గురించిన సమాచారాన్ని తన యూజర్లకు తెలియజేస్తారు. ఇతడి యూట్యూబ్ కు అనేక మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ట్రైనెట్ సొల్యూషన్ అనే సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కంపెనీని తన స్నేహితులతో కలిసి స్థాపించాడు. అది కూాడా కేవలం 13 ఏళ్ల వయసులోనే కావడం విశేషం. ఈ కంపెనీ ఇప్పటి వరకూ 12 మంది క్లయింట్ల కోసం ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది.