ప్రస్తుతం స్తబ్దుగా కొనసాగుతున్న హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో కొత్త జోష్ రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అంబానీలకు చెందిన కంపెనీలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. వారు నిర్మించబోయే టవర్లపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన టవర్లను నిర్మించనున్నారని, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ భారత్‌లోని పలు నగరాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబై, పుణె, గుర్గావ్, కోల్‌కతా వంటి నగరాల్లో ట్రంప్ టవర్లను నిర్మించారు. ఈ క్రమంలోనే దక్షిణ భారత్‌లోకి అడుగు పెట్టేందుకు స్థానిక నిర్మాణ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. రూ.6-7 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ట్రంప్ కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే హైదరాబాద్ లోని కోకాపేటలో ట్రంప్ టవర్ల నిర్మాణానికి స్థానిక సంస్థ ఐరా రియాల్టీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.
కోకాపేటలో ట్రంప్ టవర్లు నిర్మించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు ఐరా రియాల్టీ తెలిపింది. రెండు వారాల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత పూర్తి వివరాలు బహిర్గతం చేస్తామని కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం 63 అంతస్తుల్లో జంట టవర్లను నిర్మించనున్నారని, అవి నగరంలోనే అత్యంత ఎత్తైనా టవర్లుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోకాపేటలో అత్యంత ఎత్తైన భవనం 57 అంతస్తులతో ఉంది. ఇదే స్థాయిలో నిర్మించేలా మరిన్ని కంపెనీలు అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.
మరోవైపు.. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సైతం హైదరాబాద్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో వివాదాలు లేని భూమి కోసం అన్వేషిస్తున్నారట. భూమి కలిగిన స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే అంబానీ టవర్లు సైతం హైదరాబాద్ రియాల్టీని సరికొత్త శిఖరాలకు చేర్చనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ టవర్లు, అంబానీ టవర్లు హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారంటే అది కచ్చితంగా మార్కెట్లో జోష్ తీసుకొస్తుందని తెలిపాయి.