దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలో తప్పా మిగతా అన్నిరంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,661.62 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,657.71 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. అత్యధికంగా 81,049.03 పాయింట్లకు పెరిగింది. చివరకు 294.85 పాయింట్ల లాభంతో 80,796.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 114.45 పాయింట్లు పెరిగి.. 24,461.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2462 షేర్లు లాభాలను నమోదు చేశాయి.
మరో 1404 షేర్లు పతనం కాగా.. 171 షేర్లు మారలేదు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి. బ్యాంకింగ్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, పవర్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి ఒకశాతం పెరిగాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం అత్యధికంగా లాభపడ్డాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ నష్టపోయాయి.