భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) సూచీలు మంగళవారం (మే 6, 2025న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం రెడ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 156 పాయింట్ల నష్టపోయి 80,641 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 82 పాయింట్లు తగ్గిపోయి 24,379 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్లు దిగజారీ 54,271 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1240 పాయింట్లు దిగజారింది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
టాప్ 5 లాసింగ్ స్టాక్స్
అన్ని రంగాల్లోనూ అమ్మకాలు పెరగడంతో సూచీలు ఒత్తిడిలో కనిపించాయి. ఈ నేపథ్యంలో Eternal (Zomato), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టాటా మోటార్స్, NTPC, అదానీ పోర్ట్స్ కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక లాభాల్లో నిలిచిన కంపెనీలలో భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, మహీంద్రా & మహీంద్రా (M&M), హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా ఉన్నాయి. ఇదే సమయంలో Nifty Midcap100 సూచీ 2.27% పడిపోగా, Nifty Smallcap100 సూచీ 2.50% నష్టపోయింది.
రంగాల వారీగా చూస్తే..
ఇక రంగాల వారీగా చూస్తే ఆటోమొబైల్ తప్ప, NSEలోని అన్ని ప్రధాన రంగాల సూచీలు నెగటివ్ ట్రెండ్‌ను కనిపించాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 4.84% పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 10.91%, యూనియన్ బ్యాంక్ 6.33%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.19% నష్టపోయాయి. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా అమ్మకాల ఒత్తిడికి లోనైందే. గోద్రేజ్ ప్రాపర్టీస్ 6.36%, శోభా 4.96% నష్టపోయాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో ఉన్న అస్థిరతను సూచించే ఇండియా VIX సూచీ 3.58% పెరిగి 19 వద్ద స్థిరపడింది. ఇది సమీప భవిష్యత్తులో మరింత హెచ్చుతగ్గులకు లోనుకానుంది.