భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, బంగారం ధరలపై యుద్ధం ప్రభావం ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. భారత్-పాకిస్తాన్ ఘర్షణలు.. బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని అనేక రిపోర్టులు సూచిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు రికార్డు స్థాయికి (Record Level) చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. మూడు నాలుగు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి.
పసిడి లక్ష రూపాయలు దాటింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,00,750కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం రూ.1,050 పెరుగుదలతో రూ.1,00,350కి ఎగబాకింది. కిలో వెండి కూడా రూ.440 పెరిగి రూ.98,940 ధర పలికింది. ఈ పెరుగుదలకు భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇండియా-పాక్ సైనిక చర్యలు, ప్రధాన కారణమని చెబుతున్నారు. భారత్, పాకిస్తాన్ రెండూ ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారులు. కనుక ఈ దేశాల్లో అస్థిరత బంగారం డిమాండ్‌ను పెంచుతోంది. ఉదాహరణకు, 2002లో ఇండియా-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో బంగారం ధరలు 27 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో బంగారం ధరలు 8% పెరిగాయి. ఈ చారిత్రక ఉదాహరణలు యుద్ధ సమయాల్లో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయని సూచిస్తున్నాయి.
బంగారం ధరలు తగ్గే చాన్స్ ఉందా?
అయితే, కొన్ని రిపోర్టులు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. మే 7, 2025న కొన్ని భారతీయ నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఉదాహరణకు, ముంబైలో 22-క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ. 90,750, 24-క్యారెట్ రూ. 99,000 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు 1.8% తగ్గి, ఔన్స్‌కు 3,369.65 డాలర్ కి చేరాయి. ఈ తగ్గుదలకు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఉద్రిక్తతలను తగ్గించడం, ఫెడరల్ రిజర్వ్ రేట్లను మార్చకపోవడం వంటి కారణాలు దోహదపడ్డాయి. ఒకవేళ ఇండియా-పాక్ ఘర్షణలు తగ్గి, రూపాయి విలువ బలపడితే, బంగారం దిగుమతులు చౌకగా మారి, దేశీయ ధరలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.