భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికా-చైనా (USA-China) ట్రేడ్ టాక్స్ (Trade talks), రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి లాంటి అంతర్జాతీయ అంశాలు మార్కెట్లలో జోష్ పెంచాయి. దాంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆకాశమే హద్దుగా పైకి ఎగిశాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 3 వేలకుపైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 25 వేల మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలు ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 80,803.80 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే దూకుడు కొనసాగించింది.
ఇంట్రాడేలో 3 వేల పాయింట్లకు పైగా లాభంతో 82,495.97 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 2975.43 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 916.70 పాయింట్ల లాభంతో 24,924.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువగా నిలకడగా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ మినహా మిగిలిన షేర్లు లాభాలు చవిచూశాయి.
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 65 డాలర్లు, బంగారం ఔన్సు 3222 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 6.70 శాతం మేర లాభపడింది. గడిచిన ఐదేళ్లలో ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు కూడా 4 శాతం మేర రాణించాయి.