అమెరికా అప్పులపై అంతర్జాతీయంగా ఆందోళన నెలకొనడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావం దేశీయ సూచీల మీద కూడా బలంగా పడింది. దీంతో బుధవారం భారీగా లాభపడిన సూచీలు గురువారం నష్టాలను మూటగట్టుకున్నాయి. మరోవైపు విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగడం కూడా నెగిటివ్‌గా మారుతోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
బుధవారం ముగింపు ( 81, 596)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయి 80, 489 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే చివర్లో కాస్తంత కొనుగోళ్ల మద్దతు దొరకడంతో కోలుకుంది. చివరకు 644 పాయింట్ల నష్టంతో 80, 951వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 203 పాయింట్ల నష్టంతో 24, 609 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో సోలార్ ఇండస్ట్రీస్, పీబీ ఫిన్‌టెక్, ఆస్ట్రాల్ లిమిటెడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోల్గేట్, పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్, బీఎస్‌ఈ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 294 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86గా ఉంది.