బంగారం ధరలు మగువలకు షాక్ ఇస్తున్నాయి. మొన్నటి వరకు రికార్డు స్థాయికి పెరిగిన ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మళ్లీ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వరుసగా మూడోరోజు ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.100 పెరిగి తులానికి రూ.98,750కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.100 పెరిగి తులానికి రూ.98,300కి పెరిగింది.
మరో వైపు ఎండి ధర కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. శుక్రవారం ఒకే రోజు ధర రూ.2వేలు తగ్గింది. కిలోకు రూ.99,200కి పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ మధ్య అమెరికా ఆర్థిక విధానం విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో బులియన్ ధరల దీర్ఘకాలిక డిమాండ్‌కు మద్దతు లభిస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పసిడి రూ.89,400కి తగ్గింది. 24 క్యారెట్ల రూ.97,530 వద్ద కొనసాగుతున్నది. ఇక వెండి కిలో ధర రూ.1.11లక్షలు పలుకుతున్నది.