హైవేలపై ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, (New Toll Policy) ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు.. కేంద్ర ప్రభుత్వం కొత్త టోల్ పాలసీని ప్రవేశపెట్టబోతుంది. తద్వారా హైవే ప్రయాణం మరింత సులభతరం కానుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. వాహన యజమానులు త్వరలో ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఎంచుకోవచ్చు. ఈ వార్షిక పాస్ కోసం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఏడాది మొత్తం వాహనాల్లో తిరగొచ్చు.
కొత్త పాలసీకి సంబంధించి సింగిల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడాదికి రూ. 3వేలు ఒకేసారి చెల్లింపుతో అన్‌లిమిటెడ్ జర్నీ చేయొచ్చు.
నివేదికల ప్రకారం.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త టోల్ విధానం కింద రెండు రకాల పేమెంట్ సిస్టమ్ పరిశీలిస్తోంది. ప్రతిపాదిత టోల్ విధానం ప్రకారం.. వినియోగదారులకు వార్షిక పాస్, దూరం ఆధారిత ధర ఆప్షన్ అందించనుంది.
ఈ కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. వాహనదారులు ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. జాతీయ రహదారులపై వాహనాలకు ఇబ్బందిలేకుండా ప్రయాణించవచ్చు.
దూర ఆధారిత టోల్ : వార్షిక పాస్ లేని వాహనదారులు కిలోమీటర్ ఆధారంగా టోల్ చెల్లించాలి. 100 కి.మీకు రూ. 50 ఫ్లాట్ టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
వార్షిక పాస్ తీసుకున్న వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్‌ను ఒకేసారి వార్షిక రుసుము రూ. 3వేలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ వార్షిక పాస్ ఎంచుకోవడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు లేదా ఇన్‌స్టాలేషన్స్ అవసరం లేదు. ఇప్పటికే ఉన్న FASTag అకౌంట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.
గతంలో 15 ఏళ్ల పాటు రూ.30వేలు అందించే లైఫ్ టైమ్ ఫాస్ట్‌ట్యాగ్ ఆలోచనను కూడా ప్రభుత్వం విరమించుకుంది. ప్రస్తుత టోల్ ప్లాజా ప్రకారం.. 100 కి.మీ.కు రూ. 50 ఫ్లాట్ రేట్‌ను ఎంచుకోవచ్చు.
ఇది అమల్లోకి వస్తే.. ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. సాధారణ ప్రయాణికులకు రోడ్డు ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది.