భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. 15% తగ్గే అవకాశం

కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లు గోల్డ్‌ రేట్ల (Gold price)ను నిశితంగా గమనిస్తున్నారు. కొంత కాలం వేగంగా పెరిగిన ధరలకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు ట్రెండ్‌ ఎటు వెళ్తుందోనని ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే రాబోయే నెలల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం, మరో రెండు నెలల్లో బంగారం ధరలు డాలర్ పరంగా 12– 15% తగ్గవచ్చు.

రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏకంగా గోల్డ్‌ 38% పతనం అవుతుందని అమెరికన్ రీసెర్చ్‌, అనలిస్ట్‌ కంపెనీ మార్నింగ్‌స్టార్‌కి చెందిన అనలిస్ట్‌ ఒకరు అంచనా వేస్తున్నారు. అయితే  లాంగ్‌ టర్మ్‌లో బంగారం విలువ గురించి నిపుణులు పాజిటివ్‌గా ఉన్నారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని గోల్డ్‌కి కేటాయించాలని సలహా ఇస్తున్నారు.

ప్రస్తుత బంగారం ధరలు, మార్కెట్ ట్రెండ్‌
2025 జూన్ 3న భారతదేశంలో 10 గ్రాముల రిటైల్ బంగారం ధర రూ.96,960 వద్ద ఉంది. 3% గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(GST)తో కలిపి ధర 10 గ్రాములకు రూ.99,868కి చేరుతుంది. అయితే పెరుగుతున్న ధరలు ఇండియాలో గోల్డ్ డిమాండ్‌ను దెబ్బతీశాయి. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30% తగ్గుదలని రిపోర్ట్‌ చేసింది. గత రెండు వారాల్లో యావరేజ్‌గా 1,600 కిలోలు తగ్గాయని, ధరలు దాదాపు 5% పెరిగాయని పేర్కొంది.

మే 15న 10 గ్రాముల ధర రూ.92,365కి పడిపోయింది. మే ప్రారంభం, ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉందని IBJA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా ‘ఎకనామిక్‌ టైమ్స్‌’తో చెప్పారు. కానీ ధరలు మళ్లీ పెరగడంతో, కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో స్థిరమైన ధరలు డిమాండ్‌ను పెంచుతాయని వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్‌కి చెందిన కవితా చాకో అభిప్రాయపడ్డారు.

* బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?
ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ఇలాంటి అస్థిర సమయాల్లో పెట్టుబడిదారులు తరచుగా బంగారాన్ని ‘సేఫ్‌ హెవెన్‌’గా భావిస్తారు. వాణిజ్య వివాదాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు గోల్డ్‌ ప్రైసెస్‌ ర్యాలీకి ఆజ్యం పోశాయి.

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రభావం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఇటీవల ట్రంప్, చైనా టారిఫ్‌లు, వాణిజ్య అడ్డంకులను తగ్గించే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తదుపరి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు