సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతని వివరాలు పూర్తిగా తెలియనప్పటికీ సౌరవ్ పోస్టు సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. దీంతో ఈ పోస్టు ఏ మాత్రం అనుభవంలేని పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. సౌరవ్ తన దివంగత తండ్రి నుంచి JSW స్టీల్ షేర్లను వారసత్వంగా పొందానని, ఇది ఊహించని విధంగా కోట్ల లాభం తెచ్చిపెట్టిందని పేర్కొంటూ ఎక్స్ ఖాతాలో శనివారం (జూన్ 7, 2025) పోస్ట్ చేశారు. 1990లలో కేవలం రూ.1 లక్షకు కొనుగోలు చేసిన ఈ షేర్లు 30 యేళ్ల తర్వాత ప్రస్తుతం దాదాపు రూ. 80 కోట్ల మార్కెట్ విలువకు పెరిగాయని తెలిపాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈక్విటీ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రయోజనాలకు ఈ సంఘటన ఓ నిదర్శనం. సరైన సమయంలో నాణ్యమైన కంపెనీలలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందిస్తుంది.
నెటిజన్లు ఈ పోస్టుపై భిన్నంగా స్పందిస్తున్నారు. అధిక మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు మద్దతు ఇస్తున్నారు. బలమైన వ్యాపారాలలో వాటాలను విక్రయించడానికి తొందరపడటం కంటే, పెట్టుబడిదారులు సమయానికి రాబడిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇవ్వాలని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అయితే ప్రస్తుత టాపిక్ పెట్టుబడి గురించి మాత్రమే కాదు.. ఇది ఆర్థిక వారసత్వాలను నిర్మించడం గురించి కూడా అని ఒక నెటిజన్ పేర్కొన్నారు. కొనండి.. మర్చిపోండి.. అంటూ ఇంకో నెటిజన్, నాణ్యమైన స్టాక్‌లను కొనుగోలు చేయడం, రోజువారీ లావాదేవీలు విస్మరించడం అద్భుతాలు చేస్తుందని మరో నెటిజన్ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. స్టాక్ స్ప్లిట్‌లు, బోనస్ ఇష్యూలు, డివిడెండ్ చెల్లింపులు వంటి కార్పొరేట్ చర్యలు సంచిత ప్రభావం సంపద సృష్టికి గణనీయంగా దోహదం చేస్తాయని ఇంకొకరు రాసుకొచ్చారు.