గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత టాటా గ్రూప్ షేర్ల స్టాక్ మార్కెట్లో భారీగా పడిపోయాయి. సెన్సెక్స్‌లో జాబితా అయిన గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలైన టాటా మోటార్స్, టైటాన్, టాటా స్టీల్, టీసీఎస్ షేర్లు భారీ అమ్మకాలు జరిగాయి. టాటా మోటార్స్ షేర్లు 2.98 శాతం పతనంతో రూ.714.45 వద్ద ట్రేడయ్యాయి. టైటాన్ షేర్లు 2.62 శాతం పతనంతో రూ.3448.90 వద్ద, టాటా స్టీల్ 2.44 శాతం పతనంతో రూ.152.60, టీసీఎస్ షేర్లు 1.15 శాతం పతనంతో రూ.3432.00 వద్ద ట్రేడయ్యాయి. అలాగే, భారత్‌లోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) షేర్లు 3.32 శాతం (రూ. 187.00) తగ్గి రూ. 5444.00 కు చేరాయి. స్పైస్‌జెట్ షేర్లు 2.40 శాతం పతనమై రూ.44.40 కు చేరాయి.
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ఏఐ-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్. ఇందులో బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్‌లో మొత్తం 254 నుంచి 267 వరకు సీట్లున్నాయి. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి దాదాపు 9గంటల ప్రయాణం తర్వాత ఉదయం 10.45 గంటలకు లండన్ సమీపంలోని గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 12 మంది సిబ్బంది సహా 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఉన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ విమానం కూలిపోయింది. ఈ విమానం ఆసుపత్రి భవనంపై కూలడంతో వైద్యులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ లండన్‌కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు ఇంకా కారణాలు తెలియరాలేదు.