భవిష్యత్తు కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు చేయాడం చాలా అవసరం. ముఖ్యంగా కలల ఇంటి నిర్మాణం, పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువుల వంటి లక్ష్యాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అయితే, ఆయా అవసరాలను తీర్చేందుకు వాటికి తగినట్లుగా రాబడులు అందించే మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తమ ప్రత్యేక ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఈ మ్యూచువల్ ఫండ్స్ సహాయపడతాయని చెప్పవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. మీరు మీ పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవచ్చు.
నెట్ అసెట్ వాల్యూ రూ.23 వేల కోట్లకుపైగా కలిగి ఉన్న 12 చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే మంచి రాబడులను అందించాయి. టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే 20 శాతానికి పైగా వార్షిక రాబడులు అందించిన 4 పథకాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్ వంటివి తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయి.
- హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్ ఫండ్ (HDFC Children’s Fund) గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఏడాదికి 21.45 శాతం చొప్పున రిటర్న్స్ అందించింది.
- ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ గిఫ్ట్ ప్లాన్ (ICICI Prudential Child Care Fund- Gift Plan) గత 5 ఏళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా 21 శాతం చొప్పున రాబడులు అందించింది.
- టాటా యంగ్ సిటిజన్స్ ఫండ్ ( Tata Young Citizens Fund ) గత 5 ఏళ్ల కాలంలో మంచి రాబడులు అందించింది. వార్షికంగా 21.54 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చింది.
- యూటీఐ చిల్డ్రన్స్ ఈక్విటీ ఫండ్ (UTI Children’s Equity Fund) అనేది గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాబడులు చూస్తే వార్షికం చొప్పున 20.39 శాతం రాబడులు అందించింది.