వెండి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు బుధవారం రూ.1,000 పెరిగి రూ.1.21 లక్షలకు చేరిం ది. వెండి ధర పెరగడం వరుసగా ఇది మూడో రోజు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (ఎంసీఎక్స్) కూడా వెండి ఫ్యూచ ర్స్ కాంట్రాక్టు ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయిని తాకాయి. జూలై గడువు కాంట్రాక్టు ధర రూ.1,09,748కి, సెప్టెంబరు గడు వు కాంట్రాక్టు రేటు రూ.1.11 లక్షలకు ఎగబాకింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న విలువైన లోహాలపైకి దృష్టి మళ్లించారు.
అయితే, బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కొనసాగుతుండటంతో వెండిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు విశ్లేషకులు తెలిపారు. అలాగే, పారిశ్రామిక అవసరాలకు తగినంత స్థాయిలో సరఫరా లేకపోవడం కూడా వెండి ధర లు ఎగబాకడానికి మరో కారణం. దాంతో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ (31.10 గ్రాములు) వెండి రేటు ఒక దశలో 37.23 డాలర్లకు చేరింది. 2012 ఫిబ్రవరి తర్వాత వెండికిదే గరిష్ఠ స్థాయి. దశాబ్దానికి పైగా కాలంలో ఔన్స్ సిల్వర్ 37 డాలర్లు దాటడం ఇదే మొదటిసారి.
ఈ ఏడాదిలో రూ.23,000 పెరుగుదల
2025 జనవరి 1న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,000గా ఉంది. అంటే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రేటు రూ.23,000 పెరిగింది. మున్ముందు మరింత ఎగబాకే అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ వెండి 36.89 డాలర్ల వద్ద కీలక నిరోధ స్థాయిని అధిగమించడమే ఇందుకు కార ణం. తదుపరి దశలో 40 డాలర్ల దిశగా పరుగు తీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, 38.34 డాలర్ల స్థాయిలో గట్టి నిరోధం ఎదురుకావచ్చని వారు భావిస్తున్నారు.
రూ.లక్షపైన బంగారం
మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర 10 గ్రాములకు రూ.540 పెరుగుదలతో రూ.1,00,910కి చేరింది. 22 క్యారెట్ల లోహం రేటు రూ.500 పెరుగుదలతో రూ.92,500కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఒకదశలో 3,400 డాలర్ల ఎగువన ట్రేడైంది.