కారులో తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద పదేపదే డబ్బులు కట్ అయ్యే టెన్షన్ లేకుండా, ఏడాదికి ఒకేసారి పాస్ తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై చాలా మందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. “FASTag యాన్యువల్ టోల్ పాస్” పేరుతో రాబోతున్న ఈ కొత్త విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యాన్యువల్ టోల్ పాస్ ముఖ్యాంశాలు
ఎప్పటి నుంచి అమలు?: 2025, ఆగస్టు 15 నుంచి
ఎంత ఖర్చు?: ఏడాదికి ఒక్కసారి రూ.3,000 చెల్లిస్తే చాలు.
ఎవరికి?: కేవలం ప్రైవేట్ వాహనాలకు (కార్లు, జీపులు, వ్యాన్లు)
వ్యాలిడిటీ: గరిష్ఠంగా 200 టోల్ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం
అసలు ఈ ‘యాన్యువల్ టోల్ పాస్’ అంటే ఏంటి?
ఇది ఒక ప్రీపెయిడ్ టోల్ పాస్. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు ఏడాదికి ఒకసారి రూ.3,000 చెల్లించి ఈ పాస్ కొనుగోలు చేస్తే చాలు. ఆ తర్వాత జాతీయ రహదారులపై ప్రయాణించినప్పుడు మీ FASTag నుంచి ఎలాంటి అదనపు డబ్బు కట్ అవ్వదు. ఈ పాస్ 200 టోల్ క్రాసింగ్‌లు లేదా 1 సంవత్సరం వరకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పుడు పాస్ వ్యాలిడిటీ ముగుస్తుంది.
ఈ పాస్ ఎవరికి వర్తిస్తుంది?
ఈ సదుపాయం కేవలం ప్రైవేట్ వాహనదారులకు మాత్రమే పరిమితం.
వర్తించేవి: కార్లు, జీపులు, వ్యాన్‌లు
వర్తించనివి: కమర్షియల్ వాహనాలు (లారీలు, బస్సులు, ట్యాక్సీలు)
నిబంధన: మీ వాహనానికి తప్పనిసరిగా వ్యాలిడ్ FASTag ఉండాలి.
టోల్ క్రాసింగ్ ఎలా లెక్కిస్తారు?
ఇక్కడ ఒక ముఖ్యమైన వెసులుబాటు ఉంది. ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు ఉండే టోల్ రోడ్లపై, మీరు వెళ్లి తిరిగి రావడాన్ని (రౌండ్ ట్రిప్) ఒకే ఒక టోల్ క్రాసింగ్‌గా లెక్కిస్తారు. దీనివల్ల డబుల్ ఛార్జింగ్ వంటి సమస్యలు ఉండవు.
ఈ పాస్ వల్ల లాభాలు ఏంటి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
టోల్ బూత్‌ల వద్ద ఆగాల్సిన పనిలేదు, ప్రయాణం సాఫీగా సాగుతుంది. పదేపదే అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతున్నాయనే చింత ఉండదు. ఓవర్‌చార్జింగ్ లేదా లెక్కల్లో గందరగోళానికి ఆస్కారం లేదు.
ఎవరికి ఎక్కువ లాభం?: నిపుణుల అంచనా ప్రకారం.. సంవత్సరానికి 2,500 – 3,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ద్వారా డబ్బు బాగా ఆదా అవుతుంది.
“ఎక్కువగా హైవేలపై ప్రయాణించే వారికి ఇది గొప్ప వరం. దీనివల్ల సుదూర ప్రయాణాలు మరింత సులభంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా మారతాయి” – నిపుణుడు జగన్నారాయణ పద్మనాభన్.
పాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఫీజు మారుతుందా?
యాక్టివేషన్: ప్రభుత్వం త్వరలో రాజ్‌మార్గ్ యాత్ర (RajmargYatra) యాప్, NHAI, MoRTH వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెస్తుంది. అక్కడ మీ వాహనం, FASTag వివరాలు ఇచ్చి పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఫీజు మార్పు: ప్రస్తుతం ఫీజు రూ.3,000గా నిర్ణయించారు. అయితే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ద్రవ్యోల్బణం లేదా పాలసీ మార్పుల ఆధారంగా ఈ ఫీజును ప్రభుత్వం సమీక్షించవచ్చు.
మొత్తం మీద ఈ “యాన్యువల్ టోల్ పాస్” విధానం భారత రహదారులపై ప్రయాణ అనుభవాన్ని మార్చే కీలకమైన సంస్కరణ. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు సమయాన్ని, డబ్బును ఆదా చేయడంలో సహాయపడనుంది.