యోగాతో రూ.లక్షల కోట్ల బిజినెస్‌..

యోగా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం యోగా.. మల్టీ బిలియన్ డాలర్ల బిజినెస్‌గా ఎదిగింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనంగా ఉన్న యోగా, ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రెండ్‌గా, ఆదాయ వనరుగా ఉపయోగపడుతోంది. ఆన్‌లైన్ కోర్సులు, శిక్షణా కేంద్రాలు, వస్తువుల అమ్మకాలతో యోగా ఒక పెద్ద వ్యాపారంగా వికసించింది. అసలు యోగాపై ఎంత బిజినెస్‌ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధునిక కాలంలో యోగా విధానం చాలా మారిపోయింది. ఆచరణలో కొత్త పుంతలు తొక్కింది. ప్రస్తుతం యోగా ప్రపంచంలోని టాప్ ఫిట్‌నెస్ ట్రెండ్స్‌లో ఒకటిగా మారింది. దీని కారణంగా యోగా రూ.లక్షల కోట్ల వ్యాపారంగా ఎదిగింది. 2023లో ప్రపంచ యోగా పరిశ్రమ విలువ సుమారు 107.1 బిలియన్ డాలర్లుగా ఉందని గణాంకాలను ఉటంకిస్తూ నిపుణులు చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. 2030 నాటికి యోగా బిజినెస్ సుమారు 9.4శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (Compound Annual Growth Rate- CAGR)తో పురోగమిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 2025 చివరి నాటికి 215 బిలియన్ డాలర్ల నుంచి 370 బిలియన్ డాలర్ల వరకు పైగా చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ యోగా అడుగు మోపింది. ఫలితంగా యోగా సెంట్రిక్ బిజినెస్ మోడళ్లు పుట్టుకొచ్చాయి. యోగాశ్రమాలు, ట్రైనింగ్ సెంటర్లు, రిట్రీట్ సెంటర్లంటూ.. యోగాను చాలా మంది అనేక విధాలుగా ఆదాయం వనరులుగా మలచుకున్నారు. యోగా శిక్షణ ద్వారా ప్రచారం కల్పిస్తూ ఎఫ్‌ఎమ్‌సీజీ (Fast Moving Consumer Goods) కంపెనీలను సృష్టించిన వ్యక్తులనూ మనం చూస్తూనే ఉన్నాం.

యోగా నేర్చుకోవడానికి యోగాశ్రమాలు అనువైన ప్రదేశాలు. ఇందులో చాలా రకాలున్నాయి. సాధారణంగా యోగా శిక్షణా కేంద్రంలో రోజువారీ క్లాసులకు వెళ్లొస్తుంటారు ఔత్సాహికులు. అందుకు భిన్నంగా.. చాలా యోగాశ్రమాలు ఒకే ప్రదేశంలో రోజులు, వారాల పాటు యోగా శిక్షణ అందించేందుకు రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. ఇందులో వసతి, భోజనం, యోగా తరగతులు, ధ్యానం, ప్రవచనాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఉంటాయి. వీటన్నింటికీ కలిపి ఒక ప్యాకేజ్.. లేదా వాటికి తగిన ఫీజులు/రుసుములు వసూలు చేస్తారు. యోగా రెసిడెన్షియల్ ప్రోగ్రాంలు సహా ప్రపంచ వెల్‌నెస్ రిట్రీట్ బిజినెస్ 2024 నాటికి 225.5 బిలియలన్ డాలర్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఈ ఏడాది చివరి నాటికి 10.5 శాతం CAGRతో 249.59 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే 2029 నాటికి 366.82 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు