పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోని అమెరికా ప్రవేశించడం అంతర్జాతీయంగా భయానక వాతావరణం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ మార్కెట్లపై నెగిటివ్ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఈ వారాన్ని సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 25 వేల మార్క్‌ను కోల్పోయింది.
గత శుక్రవారం ముగింపు (82, 408)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఒక దశలో దాదాపు వెయ్యి పాయింట్లు కోల్పోయి 81 ,476 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. రోజంతా నష్టాల్లోనే కదలాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల నుంచి సెన్సెక్స్ కాస్తా కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 81, 896 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 140 పాయింట్ నష్టంతో 24, 971 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25 వేల మార్క్‌ను కోల్పోయింది.
సెన్సెక్స్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్, కేఈఐ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, ఏంజెల్ వన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆస్ట్రాల్ లిమిటెడ్, సైమన్స్, యునైటెడ్ స్పిరిట్స్, ఒరాకిల్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 211 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.75గా ఉంది.