ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వార్తల మధ్య ప్రపంచ మార్కెట్‌లో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.900 తగ్గింది. ప్రస్తుతం తులం ధర రూ.98,900కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 తగ్గడంతో తులానికి రూ.98,300కి పతనమైంది. మరో వైపు వెండి ధర సైతం భారీగా దిగివచ్చింది. రూ.1000 తగ్గి కిలోకు రూ.1,04,200 పలుకుతుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. విదేశీ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 46.05 తగ్గి ఔన్సుకు 3,323.05 డాలర్లకు చేరుకుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో పసిడి పెట్టుబడులకు డిమాండ్ తగ్గడంతో బంగారం ఒత్తిడికి గురైందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. ఉద్రిక్తతల భయం తగ్గడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం-బుధవారం మధ్య యూఎస్ కాంగ్రెస్‌లో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ వెల్లడించారు. వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి భవిష్యత్తు విధానంపై సూచనలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.99,220 పలుకుతున్నది. ఇక వెండి కిలో ధర రూ.1.19లక్షలుగా ఉన్నది.