మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?అయితే జాగ్రత్తగా ఉండండి. కొత్త ITR నిబంధనల ప్రకారం తప్పుడు డిడక్షన్‌లు క్లెయిమ్ చేసినా, ఆదాయాన్ని దాచిపెట్టినా భారీ జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌లో తప్పుడు సమాచారం ఉందని గుర్తిస్తే, చెల్లించాల్సిన పన్నులో 200 శాతం వరకు జరిమానా, సంవత్సరానికి 24 శాతం వడ్డీ ఇంకా సెక్షన్ 276C కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి, మీ ఆదాయ వివరాలు, డిడక్షన్‌లు కచ్చితంగా ఉండాలి. కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి.
ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి, మీ క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి ముందు, డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఇంకా ఎలాంటి సాధారణ తప్పులు చేయొద్దో చూద్దాం.
సరైన బిల్లులు లేదా ఆధారాలు లేకుండా సెక్షన్ 80C కింద డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం మొదటి తప్పు. డిడక్షన్‌లు పొందడానికి పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, తర్వాత కొత్త విధానానికి మారడం రెండో తప్పు. అద్దె ఒప్పందం లేదా ఇంటి యజమాని PAN లేకుండా తప్పుడు ఇంటి అద్దె భత్యం (HRA) క్లెయిమ్‌లు చూపించడం మూడో తప్పు. వ్యక్తిగత ఖర్చులను వ్యాపార ఖర్చులుగా చూపించడం నాలుగో తప్పు. ఫ్రీలాన్సింగ్, క్రిప్టో లేదా సైడ్ జాబ్‌ల నుంచి అదనపు ఆదాయాన్ని చూయించకపోవడం ఐదో తప్పు.
ఐటీఆర్‌పై ఫైన్‌ను నివారించడానికి మీరు చేసిన క్లెయిమ్‌లకు సంబంధించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు సమర్పించే ఆధారాలు చట్టబద్ధంగా ఉండాలి. తప్పుడు క్లెయిమ్స్.. మీ ఫారమ్‌ను తప్పుదారి పట్టించకూడదు. మీ ఆదాయపు పన్ను వివరాలను మీ వార్షిక సమాచార నివేదికతో (AIS) సరిపోల్చుకోండి. మీరు అన్ని ఆదాయ వనరులను ప్రకటించారని నిర్ధారించుకోండి. గడువు తేదీని గుర్తుంచుకోండి. గడువు తేదీలోపు మీ ఐటీఆర్ దాఖలు చేయడం మర్చిపోవద్దు.
రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా జరిమానాను అడ్డుకోవచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. మీరు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని పన్ను శాఖ గుర్తిస్తే, మీ రిటర్న్‌ను సవరించినా ప్రయోజనం ఉండదు. మీ సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినప్పటికీ, ఆ పొరపాట్లకు మీరే బాధ్యులు. చట్టం ప్రకారం పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి, రిటర్న్‌ను సిద్ధం చేసిన వ్యక్తి కాదు. ఈ జరిమానా జీతం పొందే వారికి మాత్రమే కాదు. ఈ నియమం జీతం పొందే వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు, నిపుణులు, వ్యాపారాలు ఇలా అందరికీ వర్తిస్తుంది.