అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. అన్నతో సమానంగా ఆస్తి తీసుకున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే, గత కొద్ది నెలలుగా ఆయనకు సంబంధించిన సంస్థల పని తీరు మెరుగుపడింది. అప్పులు కట్టేస్తున్నారు. కొత్త ఆర్డర్లు దక్కించుకుంటూ దూసుకొస్తున్నారు అనిల్ అంబానీ. తాజాగా ఆయన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థకు జర్మన్ రక్షణ సంస్థ నుంచి రూ. 600 కోట్ల ఆర్డర్ వచ్చింది. దీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి.
జూన్ 25 రోజున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. రిలయన్స్ డిఫెన్స్‌కు చెందిన ఈ ఎగుమతి ఆర్డర్, దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ధీరూభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీ (DADC) ద్వారా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, చిన్న ఆయుధాల తయారీకి ఒక సమీకృత సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని రిలయన్స్ డిఫెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు.. గత ఐదేళ్లలో చూసుకుంటే రిలయన్స్ ఇన్‌ఫ్రా స్టాక్ 1,000 శాతానికి పైగా పెరిగింది.
రిలయన్స్ ఇన్‌ఫ్రా తన అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు జర్మన్ డిఫెన్స్, మందుగుండు తయారీదారు అయిన రైన్‌మెటల్ వాఫ్ఫే మునిషన్ GmbH నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్‌ను వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇది హైటెక్ ఆయుధ తయారీలో అతిపెద్ద ఆర్డర్‌లలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ‘ప్రపంచ రక్షణ, ఆయుధ సరఫరాలో, ముఖ్యంగా యూరప్‌లో నమ్మకమైన భాగస్వామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి రిలయన్స్ డిఫెన్స్ వ్యూహంలో ఈ ఆర్డర్ ఒక ముఖ్యమైన మైలురాయి’ అని కంపెనీ తెలిపింది.