ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ గాబ్రియల్ ఇండియా షేరు ధర ఒక్కసారిగా పెరిగింది. ఇది మల్టీబ్యాగర్ స్మాల్-క్యాప్ స్టాక్. కంపెనీ తన నిర్మాణంలో మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో షేరు ధర ఒక్కసారిగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా అన్‌చెంకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను.. ఏషియా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం చేస్తారు. ఆ తర్వాత AIPL ఆటోమోటివ్ వ్యాపారాన్ని గాబ్రియల్ ఇండియాలోకి డీమెర్జ్ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీ వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది కాబట్టి నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
గాబ్రియల్ ఇండియా తన పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా భారీ లాభాలను ఆర్జించాలని చూస్తోంది. జులై 1వ తేదీ మంగళవారం ఉదయం ఈ షేరు ధర ఒక్కసారిగా పెరిగింది. కిందటి రోజు NSE లో రూ. 702.30 వద్ద ముగియగా.. ఇవాళ చూస్తే నేరుగా 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తోనే మొదలైంది. అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం 20 శాతం లాభంతో రూ. 842.75 వద్ద స్థిరంగా ఉంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల షేరు ధర ఒక్కసారిగా పెరిగింది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర కూడా ఇదే కావడం విశేషం. ఇక కనిష్ట ధర విషయానికి వస్తే రూ. 387 గా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే రూ. 12.11 వేల కోట్లుగా ఉంది.
ఈ ఒప్పందంలో AIPL ప్రమోటర్లు కలిగి ఉన్న ప్రతి 1,000 షేర్లకు గాబ్రియల్ ఇండియా 1,158 షేర్లను ఇస్తుంది. దీని విలువను FY2025 అంచనా వేసిన ఎంటర్‌ప్రైజ్ వాల్యూ టు ఈబీఐటీడీఏకు 8 రెట్లుగా నిర్ణయించారు. ఈ ట్రాన్సాక్షన్ ద్వారా కంపెనీకి ఎలాంటి అప్పులు ఉండవు. నగదు ఖర్చు కూడా ఉండదు. కంపెనీ స్థాయిని పెంచడానికి ఈ ఏర్పాటు చేశారు.