(మార్కెట్ కబుర్లు, హైదారాబాద్):
కేఫ్ కాఫీ డే స్టోర్లు బయట మనకు చాలానే కనిపిస్తాయి. ఇవి వచ్చిన రోజుల్లో మంచి సక్సెస్ సాధించాయి. తర్వాత్తర్వాత అప్పుల కారణంగా సంస్థ ఫౌండర్ వీజీ సిద్ధార్థ ఐదేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య బాధ్యతలు నిర్వర్తించారు. కొన్నాళ్లు నెగ్గుకొచ్చినా ఇప్పుడు మాత్రం కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఆదేశించింది. దీంతో షేర్లు కుప్పకూలిపోతున్నాయి.
కాఫీ డే షేర్లు
కేఫ్ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ )కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కేఫ్ కాఫీ డే పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తోంది. కేఫ్ కాఫీ డే.. రూ. 228.45 కోట్లు చెల్లించడంలో విఫలమైందని ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ఎన్ సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ ఇలా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ అప్పుల్లో కూరుకుపోగా.. సంస్థపై దివాలా ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు మధ్యవర్తిత్వ పరిష్కార నిపుణుడ్ని ఏర్పాటు చేసింది.
ఇలా దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్ సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. కంపెనీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. సోమవారం సెషన్లో స్టాక్ భారీగా పడిపోయింది. కిందటి సెషన్లో రూ. 46.60 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంలోనే 15 శాతానికిపైగా నష్టపోయింది. ఇంట్రాడేలో 20 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ. 37.56 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.









