ఇన్వెస్టర్లకు అలర్ట్.. మరో బ్లాక్ బస్టర్ ఐపీఓ రెడీ.. దిగ్గజ కంపెనీ తొలి అడుగు!

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):

ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.. అయితే మరో ప్రముఖ సంస్థ మెగా ఐపీఓకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మంచి సక్సెస్ సాధించడంతో.. ఇన్వెస్టర్లలో ఇంకా ఆసక్తి పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్‌టీపీసీ పునరుత్పాదక ఇంధన విభాగం- ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు వచ్చేందుకు.. సెబీ దగ్గర ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 10 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఐపీఓ బూమ్ కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకే ఏకంగా 235 కంపెనీలు దాదాపు 8.6 బిలియన్ డాలర్లకుపైగా నిధుల్ని ఐపీఓలతో సమీకరించాయి. ఇంకా 3 నెలలు మిగిలుండగానే గతేడాది రికార్డును అధిగమించగా.. ఇంకా చాలా ఐపీఓలు లైన్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇటీవల బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇష్యూ ధరతో పోలిస్తే 114 శాతం ప్రీమియంతో.. రూ.150 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. తర్వాత కూడా అప్పర్ సర్క్యూట్ కొట్టడంతో.. పెట్టిన పెట్టుబడికి డబుల్ రిటర్న్స్ వచ్చాయి. ఈ ఐపీఓ ఛాన్స్ మిస్ చేసుకున్న వారికి ఎన్టీపీసీ గ్రీన్ రూపంలో మరో అవకాశం రానుంది. ఎన్టీపీసీకి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్) చెందిన రెనివబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) విభాగమైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. సుమారు రూ.10 వేల కోట్లతో ఐపీఓకు రానుంది.

దీనికి సంబంధించి తాజాగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (SEBI) డీఆర్‌హెచ్‌పీని (ప్రాథమిక పత్రాలు) సెబీకి సమర్పించింది. ఈ ఏడాది ఐపీఓల్లో ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కానుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మాతృసంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్‌లో షేర్లు ఉన్న వారికి ప్రత్యేక కోటా ఇవ్వనున్నారు. ఈ కోటా కింద గరిష్టంగా పది శాతం షేర్లను కేటాయించనున్నారు. అయితే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) సమర్పించే నాటికి ఎన్టీపీసీలో షేర్లు ఉన్నవారు ఈ కోటా ద్వారా ఐపీఓ‌కు సబ్‌స్క్ర్రైబ్ చేసుకోవడానికి అర్హులు.

ఎన్టీపీసీ రెనివబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) వ్యాపారం మంచి పురోగతిని కనబరుస్తోంది. 2032 నాటికి 60 గిగావాట్ల రెనివబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఎన్టీపీసీ గ్రూప్ రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం 3.8 గిగావాట్లు. మరో 5.9 గిగావాట్లకు సంబంధించిన పనులు జరుగుతుండగా.. 10.8 గిగావాట్ల ప్రాజెక్టులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. రెనివబుల్ ఎనర్జీ కెపాసిటీ పెంచుకోవడం, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టులు ఎన్టీపీసీ స్టాక్ విలువను పెంచడానికి దోహదం చేస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు