ఒక్కరోజే 100 శాతం పెరిగిన స్టాక్.. ఇన్వెస్టర్ల డబ్బులు డబుల్..

స్టాక్ మార్కెట్లలో ఐపీఓలు అదరగొడుతుంటాయన్న సంగతి తెలిసిందే. కొన్ని ఐపీఓలు ఊహించని విధంగా.. తొలిరోజే పెట్టుబడిపై ఎన్నో రెట్ల మేర రిటర్న్స్ అందిస్తుంటాయి. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తాయన్న కారణంతోనే ఐపీఓల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా ఇప్పుడు తొలిరోజే ఇన్వెస్టర్ల పంట పండించిన ఒక ఐపీఓ గురించి మనం తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్ లాభనష్టాలతో సంబంధం లేకుండా కొన్ని స్టాక్స్ పరుగులు పెడుతుంటాయి. ఇక్కడ కంపెనీ నుంచి వచ్చే సానుకూల ప్రకటనలు వంటివి దోహదం చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా ఐపీఓలు అంటే పక్కాగా లాభం వస్తుందనే అంచనాలు ఉంటాయి. ఇక్కడ ముందుగానే ఇష్యూ ధర నిర్ణయించి.. షేర్లను దక్కించుకునేందుకు బిడ్స్ వేయాలి. దానికి రెస్పాన్స్‌ను బట్టి.. రిటర్న్స్ ఉంటాయి. ఇంకా ఐపీఓల్లో గ్రే మార్కెట్లో ప్రీమియం ముందుగా తెలుసుకోవచ్చు. దీనిని బట్టి.. ఆ ఐపీఓ ఎంత లాభం ఇవ్వొచ్చు.. లిస్టింగ్‌తోనే ఇష్యూ ధరపై ఎంత ప్రీమియం నమోదు చేయవచ్చో ఒక అంచనాకు రావొచ్చు. అందుకే.. ఐపీఓ అంటే చాలు సగటు ఇన్వెస్టర్ ఎగబడుతుంటాడు. కనీసం ఒక లాట్ దక్కించుకునేందుకైనా బిడ్ వేస్తాడు. సక్సెస్‌ఫుల్‌గా బిడ్ దక్కిందంటే లాభాలు జేబులో నింపుకున్నట్లే. బిడ్ రాకుంటే మాత్రం నిరాశ తప్పదు. మరో ఐపీఓ కోసం ప్రయత్నించాల్సిందే.

ఇప్పుడు లిస్టింగ్‌తోనే మదుపరుల పెట్టుబడిని రెట్టింపు చేసిన ఒక ఐపీఓ గురించి తెలుసుకుందాం. అదే ఎన్విరోటెక్ సిస్టమ్స్ లిమిటెడ్. ఇది మంగళవారం సెషన్లో NSE SME ఎక్స్చేంజీలో లిస్టయింది. ఇష్యూ ధర కేవలం రూ. 56 గా ఉండగా.. దీనిపై 90 శాతం ప్రీమియంతో రూ. 106.40 వద్ద లిస్టింగ్ నమోదు చేసింది. అయితే అక్కడితోనే ఏం ఆగలేదు. మళ్లీ అప్పర్ సర్క్యూట్‌తో రూ. 111.70 వద్ద స్థిరపడింది. దీంతో ఓవరాల్‌గా చూస్తే ఇష్యూ ధరపై తొలిరోజే 99.46 శాతం లాభాలు నమోదు చేసింది. దీంతో ఈ ఐపీఓ లాట్స్ దక్కినవారి పంట పండిందని చెప్పొచ్చు.

గ్రే మార్కెట్ ప్రీమియంలో ఈ ఐపీఓ దాదాపు 84 శాతం ప్రీమియంతో లిస్టవుతుందని అంచనా వేయగా.. అంతకుమించి రెస్పాన్స్ లభించిందని చెప్పొచ్చు. బలమైన మార్కెట్ సెంటిమెంట్ దీనికి దోహదం చేయగా.. అంచనాల్ని మించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 13న మొదలై.. సెప్టెంబర్ 19న ముగిసింది. మొత్తం 54 లక్షల షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ. 30.24 కోట్లు సమీకరించాలని ఐపీఓకు వచ్చింది. ఇక ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

పెట్టుబడి పరంగా చూస్తే.. ఈ ఐపీఓ కోసం కనీసం ఒక లాట్ కింద 2000 షేర్లు కొనుగోలు చేయాలి. దీని కోసం కనీస పెట్టుబడి అంటే రూ. 56 ఇష్యూ ప్రైస్ చొప్పున చూస్తే రూ. 1,12,000 అవసరం పడుతుంది. లిస్టింగ్ ప్రైస్ రూ. 106.40 వద్ద చూస్తే.. రూ. 1.12 లక్షల పెట్టుబడిపై చేతికి రూ. 212,800 వచ్చింది. ఇక్కడ సరిగ్గా రూ. 1,00,800 లాభం వచ్చిందన్నమాట. మళ్లీ అప్పర్ సర్క్యూట్‌తో రూ. 111.70 కి చేరగా.. ఇక్కడ సంపద రూ. 2,23,400 కు చేరింది. దీనిపై లాభం రూ. 1,11,400 గా ఉంది. అంటే దాదాపుగా రెట్టింపు లాభం పొందారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు