ఏకంగా రూ.21 నుంచి రూ.1152కు జంప్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొద్ది రోజులుగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. అయితే, మార్కెట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్ని స్టాక్స్ మాత్రం రాణిస్తుంటాయి. తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంటాయి. అలాంటి స్టాక్స్ కోసం మదుపరులు వెతుకుతుంటారు. అలాంటి కోవకే చెందుతుంది భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ (Bharat Globel Developers Ltd) కంపెనీ స్టాక్. ఈ కంపెనీ షేరు గత ఏడాది కాలంలోనే ఏకంగా 5200 శాతం పెరగడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్ల దశ తిరిగింది. ఏడాదిలోనే మల్టీ మిలియనీర్లుగా మారిపోయారు. లక్ష పెట్టిన వారి చేతికి రూ.52 లక్షలకుపైగా వచ్చినట్లయింది.
స్టాక్ మార్కెట్ గత వారం చివరి రోజు ట్రేడింగ్ గమనిస్తే 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. రూ. 1152.80 వద్దకు చేరింది. ఈ కంపెనీ స్టాక్ ఆల్ టైమ్ హై స్థాయి కూడా ఇదే కావడం గమనార్హం. ఇంట్రాడేలో అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 19.59 వద్ద ఉంది. అంటే ఏడాది కాకముందే భారీగా పెరిగింది. తమ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ స్టాక్ గత వారంలో 21 శాతం లాభం ఇచ్చింది. గత 6 నెలల్లో చూస్తే ఏకంగా 473 శాతం లాభాలు అందించింది. ఈ 2024లో ఇప్పటి వరకు 11 నెలల్లో చూసుకుంటే ఏకంగా 1971 శాతం పెరిగింది. ఇక గత ఏడాది కాలంలో చూస్తే 5241 శాతం పెరిగింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొంటే ఇప్పుడు వాటి విలువ రూ. 53.41 లక్షలకుపైగా ఉంటుంది.
ట్రిపుల్ బొనాంజా..
మల్టీబ్యాగర్ రిటర్న్స్‌తో పాటు ఇప్పుడు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ తో పాటు డివిడెండ్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ కొనేందుకు మదుపరులు ఎగబడుతున్నారు. నవంబర్ 12వ తేదీ స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్ ప్రకారం.. 10 షేర్లు ఉన్నవారికి 8 షేర్లు బోనస్ గా ఇవ్వనుంది. ఇక 1 షేరును 10 షేర్లుగా విభజించనుంది. ఆపైన ఒక్కో షేరుకు 100 శాతం మధ్యంతర డివిడెండ్ ఇస్తామని తెలిపింది.
గమనిక:
పైన ప్రచురితమైన వార్త కథనం పాఠకులకు సమాచారం నిమిత్తం మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి.









