ఉద్యోగాలు చేస్తున్న మీకు ప్రభుత్వం ఎప్పుడైనా నోటీసులు పంపిందో లేదో కానీ.. ఓ పానీపూరి బండి నడిపే వ్యక్తికి మాత్రం జీఎస్టీ నోటీసులు పంపించింది. ఏంటి నమ్మడం లేదా.? ఏదో పొరబాటు జరిగిందనుకుంటున్నారా.? అలాంటి సందేహాలు అవసరం లేదు. జీఎస్టీ అధికారులు.. సదరు పానీపూరి బండి వ్యాపారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బుల లెక్కలతో సహా.. వివరాలు పంపించి, జీఎస్టీ కట్టాల్సిందే అని తేల్చారు. మరి… ఇంతకీ ఇతని సంపాదన ఎంత అనుకుంటున్నారు…
ఈ వివరాలన్నీ.. జీఎస్టీ అధికారులకు ఎక్కడివి అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం.. కొన్నాళ్లుగా దేశంలో ఆన్ లైన్ లావాదేవీలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందేగా.. ఎక్కడ పది రూపాయలు ఇవ్వాల్సి వచ్చినా, ఫోన్ తీయడం.. ఏదో ఓ యాప్ నుంచి పంపించేయడం. అదిగో.. అలా రోజర్ పే, ఫోన్ పే వంటి యాప్ ల ద్వారా ఈ వ్యక్తికి వచ్చిన డబ్బుల లెక్క అన్నమాట. సదరు యాప్ లు.. భారీగా ట్రాన్సాక్షన్లు చేస్తూ, ఆదాయాన్ని పొందుతున్న వారి వివరాల్ని జీఎస్టీ అధికారులకు సమర్పించగా.. అందులోని అమౌంట్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.
2023-24 ఏడాదిలో ఈ పానీపూరి అమ్మే వ్యక్తి ఖాతాలో ఏకంగా రూ.40 లక్షలు జమయ్యాయని తేలింది. హా.. ఇది చదువుతున్నప్పుడు మీకు పానీపూరి బండి పెట్టుకోవాలనిపిస్తుందా.. చాలా మందికి అదే ఆలోచన వస్తుంది మరి. చాలా మందికి ఏళ్లు తరబడి జీతాలు చేస్తున్నా రాని సంపాదన అది. అందుకే.. ఈ నోటీసులపై సోషల్ మీడియాలో తీరొక్క కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తుంటే, మరికొందరు.. తమ ఉద్యోగాలు, జీతాలతో పోల్చుకుంటూ పానీపూరి వ్యక్తి ఆదాయమే బాగుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడులో వస్తు, సేవా పన్ను చట్టం.. సెంట్రల్ జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 70 నిబంధనల ప్రకారం ఈ సమన్లు జారీ చేసినట్లుగా సమాచారం .









