దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. బుధవారం (జనవరి 8న) బలహీనంగా ప్రారంభమై, చివరకు కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం రెడ్‌లోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో NSE నిఫ్టీ 50 ముగింపులో 18.95 పాయింట్లు క్షీణించి 23,688.95 స్థాయికి చేరుకోగా, సెన్సెక్స్ 50.62 పాయింట్లు క్షీణించి 78,148.49 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 367 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 599 పాయింట్లు పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ నాలుగేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోనున్నదని కేంద్ర ప్రభుత్వం అంచనాలను విడుదల చేయడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. కార్పొరేట్ల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు కూడా ప్రారంభంకానుండటం కూడా మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి మరింత బలహీనపడటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. కానీ, టీసీఎస్, రిలయన్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతి లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.12 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.86 శాతం నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్ 1.34 శాతం, సర్వీసెస్ 1.26 శాతం, పవర్ 1.17 శాతం, యుటిలిటీ రంగ షేర్లు కుదేలవగా..ఎనర్జీ, ఐటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, రియల్టీ, టెక్, ఐటీ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.
టాప్ 5 లాసింగ్ స్టాక్స్
అయితే వరుసగా స్టాక్ మార్కెట్లు నాలుగోరోజు పతనం కావడం విశేషం. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాలతో ముగియగా, ONGC, TCS, రిలయన్స్, ITC, ఏషియన్ పెయింట్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ట్రెంట్ వరుసగా నాల్గో రోజు తక్కువగా ట్రైడైంది. ఈ క్రమంలో 52 వారాల గరిష్టం నుంచి 21% తగ్గింది. బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో BSEలో ట్రెంట్ షేర్లు 4 శాతం క్షీణించి రూ. 6,591కు చేరుకున్నాయి. అక్టోబర్ 14, 2024న తాకిన దాని 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.8,345.85 నుంచి 21 శాతం పడిపోయింది.
మార్కెట్ ఎందుకు పడిపోయింది?
మిడ్ స్మాల్‌క్యాప్ స్టాక్స్ మార్కెట్ మూడ్‌ని పాడు చేశాయని నిపుణులు అన్నారు. రిలయన్స్, ఆయిల్ & గ్యాస్ షేర్ల బలం కారణంగా నిఫ్టీలో పతనం పరిమితమైంది. బలహీనమైన GDP అంచనాలు బ్యాంకింగ్ స్టాక్‌లలో అమ్మకానికి దారితీశాయి. కింగ్‌ఫిషర్ బీర్ తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కి తక్షణమే బీర్ సరఫరాను నిలిపివేసినట్లు బుధవారం ప్రకటించింది.









