రిలయన్స్‌ లాభం 18,540 కోట్లు.. కలిసివచ్చిన జియో టారిఫ్‌ పెంపు

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) గాను రిలయన్స్‌ రూ.18,540 కోట్ల (ఒక్కో షేరుకు రూ.13.70) ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి నమోదు చేసిన రూ.17,265 కోట్ల (ఒక్కో షేరుకు రూ. 12.76) లాభంతో పోలిస్తే 7.4 వృద్ధి కనబరిచింది.

రిటైల్‌ వ్యాపారంతోపాటు టెలికం విభాగం అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో ఈ మాత్రమైన వృద్ధిని సాధించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికిగాను సంస్థ రూ.18,540 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.13.70 చొప్పున ఆదాయాన్ని ఆర్జించింది.   సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.27 లక్షల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు ఎగబాకింది. రూ.3.5 లక్షల కోట్లకు చేరుకున్న రుణాలకోసం సంస్థ అధికంగా చెల్లింపులు జరపడం వల్లనే లాభాలు భారీగా పుంజుకోలేకపోయాయని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి కంపెనీకి రుణాలు రూ.3.36 లక్షల కోట్లు, ఏడాది క్రితం ఇదే త్రైమాసికం నాటికి రూ.3.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.

జియో లాభంలో 24 శాతం వృద్ధి

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరోసారి భారీ లాభాలను ఆర్జించింది. గత త్రైమాసికపు లాభంలో 24 శాతం వృద్ధిని సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6,231 కోట్లుగా ఉన్న స్టాండలోన్‌ నికర లాభం గత త్రైమాసికానికిగాను 24.24 శాతం ఎగబాకి రూ.6,477 కోట్లకు చేరుకున్నది. కంపెనీ ఆదాయం రూ.25,368 కోట్ల నుంచి రూ.29,307 కోట్లకు ఎగబాకింది. డాటా వినిమయం ఊపందుకోవడం, సరాసరిగా డాటాపై వచ్చే ఆదాయం పెరగడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు 48.21 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. సరాసరి ఒక్కో కస్టమర్‌పై రూ.200 ఆదాయం సమకూరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు