రేపే కేంద్ర బడ్జెట్‌.. అంచనాలివే..

మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్‌ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్‌లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగే ఈసారీ సమాజంలోని ఆయా వర్గాలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం, సగటు ఉద్యోగులు పద్దుపై బోలెడు ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఊరటనివ్వాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. మరి వాటిని మోదీ సర్కారు ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి.

ఐటీ శ్లాబులు-రేట్లు

కొత్త, పాత వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానాల్లో శ్లాబులు, రేట్లను మార్చాలని ట్యాక్స్‌పేయర్స్‌ కోరుకుంటున్నారు. అయితే ఐదేండ్ల కిందట కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కారు.. అప్పట్నుంచి పాత ఆదాయ పన్ను విధానం జోలికే వెళ్లడం లేదు. కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికే ప్రతీ బడ్జెట్‌లో సవరణలు చేస్తూ వస్తున్నది. దీంతో ఈసారి కొత్తదానిలో వార్షిక ఆదాయం రూ.20 లక్షలు, అంతకుమించి ఉంటేనే 30 శాతం పన్ను వేయాలన్న డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను పడుతున్నది. అలాగే రూ.12-15 లక్ష ల శ్లాబుపై వర్తిస్తున్న 20 శాతం పన్నును 15 శాతానికి కుదించి.. కొత్తగా రూ.10-15 లక్షల శ్లాబును తీసుకురావాలని కోరుతున్నారు.

స్టాండర్డ్‌ డిడక్షన్‌

కొత్త ఆదాయ పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ను లక్ష రూపాయలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. పెంచితే మరింత మంది ట్యాక్స్‌పేయర్స్‌ కొత్త విధానంలోకి వచ్చే వీలుందని నిపుణులూ చెప్తున్నారు. ఇక కిందటి బడ్జెట్‌లో రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు పాత పన్ను విధానంలోనూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

పన్ను మినహాయింపు

కొత్త ఆదాయ పన్ను విధానంలో ఇప్పుడు వార్షిక ఆదాయం రూ.3 లక్షలదాకా ఉంటే ఎలాంటి పన్ను లేదు. అయితే దీన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక పాత ఆదాయ పన్ను విధానంలోనూ ఈ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఆదాయ పన్ను రిబేటు

ప్రస్తుతం వ్యక్తిగతంగా పన్ను సహిత ఆదాయం ఏటా రూ.7 లక్షలదాకానే ఉంటే పూర్తిగా ట్యాక్స్‌ రిబేటుకు వీలుంటున్నది. అయితే దీన్ని ఈసారి బడ్జెట్‌లో రూ.10 లక్షలకు పెంచాలని ట్యాక్స్‌పేయర్స్‌ కోరుతున్నారు. కొత్త ఆదాయ పన్ను విధానంలో రావాలని కోరుతున్న ఈ మార్పుతో మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట లభిస్తుందని చెప్తున్నారు. వినిమయ శక్తి కూడా పెరిగి మార్కెట్‌కు కొత్త ఉత్సాహం వస్తుందనీ నిపుణులు పేర్కొంటున్నారు.

హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనాలు

మెట్రోపాలిటన్‌ ప్రాంతాలకుతోడు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉంటున్నవారికీ హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) ప్రయోజనాలు అందేలా ఈసారి బడ్జెట్‌లో చర్యలుంటాయని అంచనా. బేసిక్‌ సాలరీలో 40 శాతానికి బదులుగా 50 శాతానికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపుల్ని పెంచవచ్చని చెప్తున్నారు.

సెక్షన్‌ 80డీ

పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆరోగ్య బీమా ప్రీమియంలూ పెరిగిపోతున్నాయి. సమగ్ర కవరేజీ కోసం మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి పాలసీదారులకు వచ్చింది. దీంతో కొత్త ఆదాయ పన్ను విధానంలో ఆరోగ్య బీమా కోసం చేసే ప్రీమియం చెల్లింపులపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80డీ కింద ఉండే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరుతున్నారు.

సెక్షన్‌ 80జీ/80టీటీఏ

స్వచ్చంధ సంస్థలకు విరాళాలు పెరిగేలా, బ్యాంకుల్లో పొదుపును ప్రోత్సహించేలా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ/సెక్షన్‌ 80టీటీఏ ప్రయోజనాలను కొత్త ఆదాయ పన్ను విధానంలోనూ అమలుపర్చవచ్చని అంచనా.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు