‘నన్నేవరూ తొక్కలేరు.. నా ఒరిజినల్‌ క్యారెక్టర్‌ వెండితెరపై చూపిస్తా..’

‘జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్’.. మరో సరికొత్త సంచలనాలకు జగ్గన్న శ్రీకారం

‘తూర్పు జయప్రకాశ్ రెడ్డి’ పేరు వినగానే ఓ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌.. ఓ సంచలనం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ..  జననేత.. జగ్గన్నగా సుపరిచితుడు. రాజకీయాల్లోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగ్గన్న మరో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా అంటే నిర్మాతగానో.. దర్శకుడిగానో కాదు.. ఆయన నటనలోకి అడుగుపెట్టి.. తన నిజజీవిత పాత్రను తానే పోషించబోతున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. హిందీలోనూ ఆ సినిమాను విడుదల చేసి ‘పాన్ ఇండియా’ స్థాయిలో తన ప్రతిభ చాటేందుకు సిద్ధమవుతుండటం విశేషం. దేశ రాజధాని హస్తిన వేదికగా ఆయన ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

తన పాత్రలో తానే నటిస్తూ…..
రాజకీయాల్లో రాజీలేని పోరాటం (ఫైట్) చేస్తానని చెబుతున్న జగ్గారెడ్డి.. ఢిల్లీ మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో సినీ రంగ ప్రవేశం గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పేరుతోనే “జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్” టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదొక ప్రేమ కథ చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు. మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని అన్నారు. తన పాత్ర ఇంటర్వెల్ ముందు వచ్చి, సినిమా చివరి వరకు ఉంటుందన్నారు. ఈ మధ్య రామానుజం (సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి) తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారు. ఆ కథలో తన నిజజీవిత పాత్రే ఉందని చెప్పగా.. తానే ఆ పాత్రలో నటిస్తానని చెప్పానని జగ్గారెడ్డి అన్నారు. ఈ ఉగాదికి కథ విని.. వచ్చే ఉగాది నాటికి సినిమా పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని ఈ సినిమాలో నటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో సినిమా నిర్మాణం పూర్తి చేసి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.

రాజకీయాల గురించి మాట్లాడుతూ..
ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఆ జాబితా చూసి తాను ఖంగుతిన్నానని జగ్గారెడ్డి స్వయంగా ఢిల్లీ తెలుగు మీడియాకు చెప్పారు. పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన “నా నిర్ణయాన్ని గౌరవించలేదని భావించడం లేదు. ఏ నేతపైనా నేను వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ అభ్యర్థుల ఎంపిక చూసి ‘మైండ్ బ్లాంక్’ అయింది. రాజకీయంగా ‘షాక్‌’లో ఉన్నాను” అని వ్యాఖ్యానించారు. అయితే తాను గెలుపోటములను స్వీకరిస్తానని, అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటానని చెప్పారు. తాను సింపథీ (సానుభూతి) కోరుకునే రకం కాదని, తాను పోరాడే రకం అని అన్నారు. తనపై ఎవరైనా సానుభూతి చూపడాన్ని కూడా ఇష్టపడనని చెప్పారు. తనను రాజకీయాల్లో ఎవరూ తొక్కలేరని ఆయన వ్యాఖ్యానించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు