ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో మీడియం డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఈ ఫండ్స్ రాణిస్తాయని, ఇతర ఆప్షన్ల కంటే మెరుగైన రాబడిని అందిస్తాయని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. మంచి రాబడి, తక్కువ రిస్కు ఉన్న చోట మనీ ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్న వారికి ఇది మంచి అవకాశం. మీడియం డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు, ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
మీడియం డ్యూరేషన్ ఫండ్స్ అంటే ఏంటి..? మీడియం డ్యూరేషన్ ఫండ్స్ ఒక రకమైన డెట్ మ్యూచువల్ ఫండ్. అవి మెకాలే డ్యూరేషన్ (మీ డబ్బును వడ్డీ, అసలు నుంచి తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుందో ఫ్యాన్సీగా చెప్పే మార్గం) ఆధారంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే బాండ్లు, ఇతర డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాయి. ఇండియా మార్కట్ రెగ్యులేటర్ సెబీ ఈ నియమాన్ని నిర్దేశిస్తుంది. నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగల, కొంచెం హెచ్చు తగ్గులను పట్టించుకోని వ్యక్తులకు ఈ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయి.
ఎందుకు పాపులర్ అవుతున్నాయి..? చాలా మంది ప్రజలు త్వరిత అవసరాల కోసం లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా-షార్ట్-టర్మ్ ఫండ్స్ లేదా బ్యాంకింగ్ & PSU ఫండ్స్ వంటి షార్ట్ టర్మ్ ఆప్షన్లు ఎంచుకుంటారు. అవి సురక్షితమైనవి, స్థిరమైనవి. మీడియం డ్యూరేషన్ ఫండ్స్ అంతగా పాపులర్ కాలేదు. కానీ అడ్వైజర్లు ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ఈ ఫండ్లు బాగా పనిచేస్తాయి. రేట్లు తగ్గడం అంటే బాండ్ ధరలు పెరుగుతాయి, అది మీడియం-టర్మ్ మెచ్యూరిటీస్తో బాండ్లను కలిగి ఉన్న ఫండ్స్ రాబడి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మీరు కొంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అది మంచి లాభాలకు అవకాశం.
వీరికి మాత్రమే..: ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఈ ఫండ్స్ అస్థిరంగా ఉంటాయి. అధిక వడ్డీ రేట్లు బాండ్ ధరలను తగ్గిస్తాయి, అది రాబడిని దెబ్బతీస్తుంది. సాంప్రదాయ పెట్టుబడిదారులు, తమ డబ్బు తగ్గడాన్ని చూడటం ఇష్టపడని వారు వీటికి దూరంగా ఉండటం మంచిదని సలహాదారులు హెచ్చరిస్తున్నారు. మీడియం, లాంగ్ టర్మ్ డెట్ ఫండ్లు వడ్డీ రేటు మార్పులకు వేగంగా స్పందిస్తాయి, కాబట్టి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేనివారికి సరిపడవు.
2025 మార్చిలో టాప్ ఆప్షన్లు..: మీరు మీడియం డ్యూరేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచనతో ఉంటే, ఈ నెలలో సెలక్ట్ చేసుకోవాల్సిన టాప్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఈ లిస్టులో ఎస్బీఐ మాగ్నమ్ మీడియం డ్యూరేషన్ ఫండ్ (SBI Margan Medium Duration Fund), హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ డెట్ ఫండ్ (HDFC Medium Term Debt Fund) ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలానే బంధన్ బాండ్ ఫండ్ – మీడియం టర్మ్ ప్లాన్ (Bandhan Bond Fund – Medium Term Plan), యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఎంచుకోవచ్చు.
ఇవన్నీ మీకు సూచనలు.. సలహాలు మాత్రమే…
మీరు పెట్టుబడి పెట్టే ముందు అవి ఎలా ఉన్నాయో చూడటానికి, మంత్లీ అప్డేట్స్ చెక్ చేయడం మేలు.









